ఏమైనా చేయండి.. మనమే గెలవాలి | Chandrababu Naidu instructions to ministers on local body elections | Sakshi
Sakshi News home page

ఏమైనా చేయండి.. మనమే గెలవాలి

Oct 30 2026 6:04 AM | Updated on Oct 30 2026 6:04 AM

Chandrababu Naidu instructions to ministers on local body elections

మంత్రులకు చంద్రబాబు ఆదేశం 

పోలీసు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని సూచనలు 

సాక్షి, అమరావతి: ఏమైనా చేయండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే గెలవాలి... అంటూ సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అవసరమైన చోట్ల పోలీసుల సహకారంతో పాటు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ‘సీట్ల సర్దుబాటును అమలు చేయాలి. 

మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలి.  మంత్రులు తమ నియోజకవర్గాలతో పాటు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న జిల్లాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎన్నికల నిర్వహణలో అవసరమైన సమన్వయం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడాలి.  క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మంత్రులు పూర్తి అప్రమత్తంగా ఉండాలి.  ఎన్నికలకు సంబంధించి ఎక్కడైనా వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించాలి. 

కూటమి పార్టీల నుంచి ఎవరైనా రెబల్‌ అభ్యర్థులుగా బరిలో ఉంటే వెంటనే వారిని సస్పెండ్‌ చేయాలి. పట్టణ స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలకు సైతం గెలుపే లక్ష్యంగా  ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి’ అని చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు సమాచారం.  కాగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ జనసేన, బీజేపీకి సంబంధించి స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పినట్లు తెలుస్తోంది.   పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీలో కొనసాగేవారిని ఉపేక్షించేది లేదని అన్నట్లు సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement