ఏడాది గడిచినా మొంథా తుపాను పరిహారానికి దిక్కులేదు..
నష్ట పరిహారం ఇచ్చేశామంటూ కోనసీమలో ముఖ్యమంత్రి కోతలు
నాడు అడ్డగోలుగా పంట నష్టం అంచనాలు కుదింపు
15 లక్షల ఎకరాల్లో నష్టపోతే..4.27 లక్షల ఎకరాలకే పరిమితం
చివరకు రూ.280.68 కోట్లు మంజూరు చేసినట్టు జీవో జారీ
ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా పైసా విదల్చని ప్రభుత్వం
తాజాగా అర్నబ్ తుపాను బాధితులనూ ఆదుకుంటామని హామీలు
సాక్షి, అమరావతి: మొంథా తుపాను బాధిత రైతులకు పరిహారం ఇవ్వకుండానే చెల్లించేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. కేవలం పరిహారం మంజూరు చేస్తున్నట్లు జీవో ఇచ్చిన సర్కార్ ఇప్పటి వరకు ఒక్క పైసా విదల్చలేదు. దీనిపై ఇప్పటికే రైతులు చంద్రబాబుపై రుసరుసలాడుతున్నారు. అర్నబ్ తుపాను వల్ల జరిగిన పంట నష్టాలను పరిశీలించేందుకు గురువారం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. మీడియాతో మాట్లాడుతూ మొంథా తుపాను పంట నష్టపరిహారం ఇచ్చేశామని అదే తరహాలో అర్నబ్ బాధితులను ఆదుకుంటామని చెప్పడంతో రైతులు విస్తుపోయారు.
నష్టం అంచనాలో కోతల మీద కోతలు
మొంథా తుపాను విరుచుకుపడి ఏడాది గడిచింది. గత ఏడాది ఇదే నెలలో అన్నదాతకు అపారనష్టం వాటిల్లింది. 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తొలుత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లకు తలొగ్గి తొలుత 4.40 లక్షల ఎకరాల్లో ప్రాథమిక నష్టం జరిగినట్టుగా అధికారులు ప్రకటించగా, ఆ తర్వాత 3.45 లక్షల ఎకరాలకు కుదించారు. ఈ క్రమంలో బాధిత రైతులకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బాసటగా నిలవడంతో రైతుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు 4.27 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు లెక్కతేల్చారు. ఇదే రీతిలో ఇన్‌పుట్ సబ్సిడీ(పెట్టుబడి రాయితీ)ని చివరకు 3.23 లక్షల మందికి రూ.411కోట్లకు కుదించారు.
ఇందులో వ్యవసాయ పంటలకు రూ.390 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.20.92 కోట్లు, మల్బరీ తోటలకు రూ.4.43 కోట్లుగా లెక్కతేల్చారు. తీరా నిధుల విడుదల విషయానికి వచ్చేసరికి మళ్లీ కోతలు పెడుతూ రూ.280.68 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో వ్యవసాయ పంటలకు రూ.266.41 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.14.26 కోట్లు, పట్టు పరిశ్రమకు కేవలం రూ.1.06 లక్షల చొప్పున లెక్కతేల్చారు. కాగా మత్స్యశాఖకు రూ.3.79 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.81 లక్షల మాత్రమే నష్టం వాటిల్లినట్టు ప్రకటించారు. ఆ మేరకు నిధులు మంజూరు చేస్తూ జూన్ 30వ తేదీన జీవో ఆర్టీ నెం.70ను ప్రభుత్వ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.వెయ్యి కోట్లకుపైగా బకాయిలు
మొంథా తుపాను బాధిత రైతులకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదలై దాదాపు నాలుగు నెలలు గడిచినా ఏ ఒక్క బాధిత రైతుకు పైసా కూడా జమ కాలేదు. వీటితో పాటు గడిచిన 18 నెలల్లో సంభవించిన వరుస వైపరీత్యాలు, కరువు సాయం బకాయిలు కలిపి రూ.వెయ్యి కోట్లకు పైగా జమ చేయాల్సి ఉండగా, వాటి ఊసెత్తకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలక్షేపం చేస్తూ రైతుల ఉసురు పోసుకుంటోంది. తాజాగా అర్నబ్ తుపాన్ దెబ్బకు రైతులను తీవ్రంగా నష్టపోతే నివేదికలంటూ కాలక్షేపం చేస్తూ వారిని ఏమార్చే కార్యక్రమానికి తెగబడుతోంది.


