జనసేన నేత ఆత్మహత్యాయత్నం.. 50 లక్షలే కారణమా? | Tirupati Janasena Rajaesh Achari Issue Related Full Details | Sakshi
Sakshi News home page

జనసేన నేత ఆత్మహత్యాయత్నం.. 50 లక్షలే కారణమా?

Oct 30 2026 9:06 AM | Updated on Oct 30 2026 9:13 AM

Tirupati Janasena Rajaesh Achari Issue Related Full Details

సాక్షి, తిరుపతి: జనసేన పార్టీలో కార్పొరేటర్‌ టికెట్‌ వ్యవహారం వివాదానికి దారితీసింది. తిరుపతిలో 47వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేసిన జనసేన నాయకుడు రాజేష్‌ ఆచారి.. తనకు బీఫామ్‌ ఇవ్వలేదని, టికెట్‌ కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రూ.50 లక్షలు డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా జనసేన నాయకుడు రాజేష్‌ ఆచారి తీవ్ర ఆరోపణలు చేశారు. కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేయాలంటే రూ.50 లక్షలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో జనసేన పార్టీ తరఫున తొలుత కార్పొరేటర్‌ అభ్యర్థిగా కార్యాలయం ప్రారంభించింది తానేనని చెప్పారు. నామినేషన్‌ వేసినా తనకు బీఫామ్‌ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హవాయి చెప్పులు వేసుకున్న వ్యక్తిని సైతం అసెంబ్లీకి పంపిస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారని రాజేష్‌ ఆచారి గుర్తుచేశారు.

ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయాన్ని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తన చావును చూసిన తర్వాతైనా పవన్‌ కల్యాణ్‌ తిరుపతికి వస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై రాజేష్‌ ఆచారి చేసిన రూ.50 లక్షల డిమాండ్‌ ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించాల్సి ఉంది. 

ఇదీ చదవండి: యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. పింఛన్ల ముసుగులో ఓటర్లకు తాయిలాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement