తిరుపతి మంగళం : ఆధ్యాత్మిక క్షేత్రం నుంచి కబ్జాకోరులను తరిమేద్దామని, ఓటు ద్వారా అక్రమార్కుల అంతుచూద్దామని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి జీవకోనలో వైఎస్సార్‌సీపీ మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. భూమన మాట్లాడుతూ దేశమే గర్వించదగిన సినీనటి శ్రీదేవి చిన్నమ్మ భూమి, టీడీపీలోని సర్పంచ్ భూమి, విశ్రాంత ఆర్‌టీఓ భూమితో పాటు అనేక మంది భూములను కబ్జా చేసిన టీడీపీ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు ఓటు వేస్తారా? లేక అతి సామాన్యుడు, పేదవాడు మీ భూములను పరిరక్షిస్తూ కాపలాదారుడిగా ఉండే వైఎస్సార్ సీపీ మేయర్ అభ్యర్థి వాసుయాదవ్‌కు ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని కోరా రు. 70 ఏళ్ల తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ గూండాల అరాచకాలు, దాడులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జేబీ శ్రీనివాస్ గుంటూరు నుంచి తిరుపతికి వలస వచ్చాడని, కబ్జాలకు పాల్పడితే అతడికి చంద్రబాబు, లోకేష్ టీడీపీ నగర ఇన్‌చార్జి, మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించి తిరునగర పవిత్రతను మంటగలిపారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ జేబీ శ్రీనివాస్ లాంటి అక్రమార్కు లను పెంచిపోషిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల రోజు కూడా రౌడీలను తీసుకొచ్చి రిగ్గింగ్ చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను, ఏజెంట్లను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బాగా ఆలోచించి భూకబ్జాదారులను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.


