మర్యాద చేస్తాం.. రండి
ప్రచారంలో న్యూ ట్రెండ్
రానుపోనూ ప్రయాణ ఖర్చులు మేం చూసుకుంటాం. మర్యాదలు చేస్తాం. ఓటుకు నోటు సైతం ఇస్తాం. మన ఊరికి రండి. ఓటు వేయండి... ప్లీజ్ అన్నగారూ.. అంటూ రెండు రోజులుగా ఎన్నికలలో బరిలో నిలిచిన అభ్యర్థులు వలస కార్మికులకు ఫోన్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్న తమ ఊరివాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు బతిమాలుకుంటున్నారు. హైదరాబాదు, చైన్నె, బెంగళూరులోని తమ ఓటర్లకు స్పెషల్ ప్యాకేజీలను సైతం ఆఫర్ చేస్తున్నారు. ఏసీ స్లీపర్ బస్సులు, రైళ్ల టికెట్లు బుక్ చేసి వాట్సాప్‌లో పంపుతున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉంటే వారికి ప్రత్యేకంగా మినీ బస్సును సైతం ఏర్పాటు చేసి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గట్టి పోటీ ఉన్న అభ్యర్థులు విదేశాలలోని తమ బంధువులను సైతం రప్పించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. – తిరుపతి సిటీ
పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్‌లు, మైకులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ, పెయింటింగ్ బొమ్మలతో ప్రచారమా పాతమనిషిలా ఉన్నావే.. అది ఓల్డ్ గురూ.. ప్రస్తుతం రీల్స్, మీమ్స్, వాట్సాప్, ఇన్‌స్ట్రా, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ ఇదీ నయా ట్రెండ్. వీటినే ప్రజలు ఆదరిస్తారు అంటూ స్థానిక ఎన్నికలలో న్యూ ట్రెండ్ మొదలైంది. డిజిటల్ యుగంలో పార్టీల ప్రచారంలోనూ తీరు మారి కొత్తపుంతలు తొక్కుతోంది. యువతను, మహిళలను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు సోషల్ మీడియాను వినియోగిస్తూ దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ఏఐ ద్వారా వివిధ వీడియోలను క్రియేట్ చేసి ఓటర్లకు పంపుతున్నారు. ప్రత్యర్థులను విమర్శించే మీమ్స్, రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తమ పార్టీ ఇచ్చిన హామీలు, నెరవేర్చిన తీరు, భవిష్యత్తులో తాము చేయబోయే అభివృద్ధి వంటి వాటిని కళ్లకు కట్టినట్లు వీడియోలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. – తిరుపతి సిటీ


