తిరుపతి తుడా : తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్లను, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని, స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్ సెంటర్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ జయకృష్ణతో కలసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర నిఘా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, ఎలక్షన్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి పాల్గొన్నారు.
పైకప్పు నుంచి పడి ఇద్దరి మృతి
రేణిగుంట : మండలంలోని గాజుల మండ్యం పారిశ్రామిక వాడలో పీఆర్ రోలింగ్ కంపెనీ పైకప్పు నుంచి జారిపడి ఇద్దరు కార్మికులకు మృతి చెందారు. వివరాలు.. రోలింగ్ కంపెనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్మాన్ (37), రాజమండ్రికి చెందిన మధమణి వీర వెంకట గోపాల్ (29) సుమారు 30 అడుగుల ఎత్తున పైకప్పుపై ఇనుప రేకులు అమరుస్తుండగా రేకులు విరిగిపోవడంతో కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
కక్షగట్టి.. ఇల్లు కూల్చి!
రేణిగుంట : మండలంలోని కరకంబాడి పంచాయతీ చెంగా రెడ్డిపల్లె వద్ద ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దిలీప్ కుటుంబీలకు చెందిన రేకుల ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కూల్చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ నేతలు తమ ఇల్లు కూల్చేశారని బాధితులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులను వివరణ కోరగా తాము ఎవరి ఇంటిని పడగొట్టలేదని తెలిపారు.


