తిరుపతి అర్బన్ : అధికారులు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ పార్టీకి సహకరించినా వేటు తప్పదని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. లెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాల్సి ఉందని చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపిస్తామని తెలిరారు. శుక్రవారం సాయంత్రానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుందని చెప్పారు. శనివారం లేదా ఎలక్షన్ రోజు ఆదివారం ఎవరైనా ఎన్నికల ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ రోజు క్యూ వద్దకు వచ్చి ఓట్లు అడిగినా క్రిమినల్ కేసులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 3,850 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 46 సమస్యాత్మక, 63 అతి సమస్యత్మక కేంద్రాలను గుర్తించామని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పోలీస్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఓటుకు వెళ్లకుండా ఎక్కడైనా అడ్డుకుంటే వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పోలింగ్ అధికారుల పాత్ర కీలకం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పీఓలు, ఏపీఓల పాత్ర కీలకమని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్‌లోఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కమిషనర్ జయకృష్ణ, డీఆర్‌ఓ నరసింహులతో కలసి ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పకుండా హజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు ముందస్తు కార్యాచరణతో వ్యవహరించాలని ఆదేశించారు.
ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ గోవిందరావు, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ జయకృష్ణతో కలసి అఽధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలోనే తిరుపతిలో డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్ ఉందన్నారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి వస్తున్నారని వెల్లడించారు. వీఐపీలకు ప్రభుత్వ అతిథి గృహాల్లో వసతి కల్పించాలని సూచించారు. పైవేటు హోటల్స్, హోమ్‌స్టేలను రిజర్వు చేసి పెట్టాలని స్పష్టం చేశారు.డీఆర్‌ఓ నరసింహులు, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, శ్రీనివాస్, శ్రీలత, రామకృష్ణ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ శారదాదేవి, ఆర్‌డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, డీపీఓ సుశీలాదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజా నాయక్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ మధుసూదన్, ఐబీ అధికారి శిరీష, సీఐఎస్‌ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, ఐసర్ జాయింట్ రిజిస్ట్రార్ కొహ్లీ, ఐఐటీ రిజిస్ట్రార్ కృష్ణకుమార్, ఇండియన్ కులినరీ ఇన్‌స్టిట్యూట్ అధికారి తిరులోగ్ పాల్గొన్నారు.


