కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం | Supreme Court Slams Corporate Affairs Ministry For NCLT NCLAT Hijack And Warns Against Interference In Tribunal Autonomy | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Oct 30 2026 8:51 AM | Updated on Oct 30 2026 9:29 AM

Supreme Court Slams Ministry of Corporate Affairs Over NCLT NCLAT Hijack

సమగ్ర నివేదిక కోరిన ధర్మాసనం

దేశంలోని అత్యున్నత కంపెనీ లా ట్రైబ్యునళ్ల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) పరిపాలనా వ్యవహారాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుందని అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. వ్యవస్థల స్వయంప్రతిపత్తికి ఈ జోక్యం తీవ్ర విఘాతం కలిగిస్తోందని, ఇది దురదృష్టకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

‘పూర్తిగా కైవసం చేసుకున్నారు’

ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన జ్యుడీషియల్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఈ వ్యవస్థల నిర్వహణను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తిగా హైజాక్ (హస్తగతం) చేసుకుంది. అదే అసలు సమస్య. ఇది ఆ సంస్థల స్వయంప్రతిపత్తిని తీవ్రంగా దెబ్బతీస్తోంది’ అని ప్రధాన జ్యూడీషియల్ ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ప్రభుత్వానికి ఈ సంస్థలపై పూర్తి పట్టు ఉండాలనే దురాలోచన స్పష్టంగా కనిపిస్తోందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

సమస్యల వలయంలో ట్రైబ్యునళ్లు

ట్రిబ్యునళ్లలో నెలకొన్న మౌలిక వసతుల లేమి, సిబ్బంది కొరతపై కూడా న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌సీఎల్‌టీ ప్రిన్సిపల్ బెంచ్‌లో భవనాల పైకప్పులు దెబ్బతినడం, కొన్ని అంతస్తులు మూసివేయడం వంటి అంశాలను సీనియర్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. తగినంత మంది సభ్యులు లేకపోవడం వల్ల అనేక బెంచ్‌లు కేవలం సగం సమయం మాత్రమే పనిచేస్తున్నాయని, దీనివల్ల కార్పొరేట్ దివాలా ప్రక్రియలు, కంపెనీ వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని న్యాయవాదులు వాదించారు. కాంట్రాక్టు ఉద్యోగుల నియామకాలు, అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణ విషయంలో మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తున్న తీరుపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అధ్యక్షులకే సర్వాధికారాలు

ట్రైబ్యునళ్లలో పారదర్శకత, స్వయంప్రతిపత్తి నిలబడాలంటే నియామకాలు, పరిపాలనా పరమైన పూర్తి అధికారాలు ఆయా సంస్థల అధ్యక్షులకే ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తొలుత డిప్యూటేషన్‌పై సిబ్బందిని తీసుకుని ఆ తర్వాత యూపీఎస్‌సీ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా క్రమంగా రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని సూచించింది. ఈ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనే దిశగా ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ అధ్యక్షులు స్వయంగా రంగంలోకి దిగాలని కోర్టు కోరింది. ట్రిబ్యునళ్లలో ఉన్న మౌలిక వసతుల లోపాలు, సిబ్బంది కొరత, ఇతర పరిపాలనాపరమైన అవసరాలపై సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: 40 వేలమంది భద్రతా సిబ్బంది డేటా లీక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement