మ్యూచువల్ ఫండ్ రంగంలో మదుపర్ల ప్రయోజనాలను మరింత పరిరక్షించే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చూపడుతోంది. నవంబర్ 1 నుంచి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (ఏఎంసీ) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్స్ ఇకపై డిఫాల్ట్ ఆప్షన్‌గా మారనున్నాయి. సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత్ పాండే ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. ఈ నిబంధనల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు, మదుపర్లపై దీని ప్రభావం ఎలా ఉండనుందనే అంశాలు కింద చూద్దాం.
అసలు మార్పు ఏమిటి?
సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో డైరెక్ట్, రెగ్యులర్ అని రెండు రకాల ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండూ ఒకే రకమైన అండర్ లైయింగ్ పోర్ట్‌ఫోలియోలో ఒకే పథకంలో పెట్టుబడి పెడతాయి. అయితే, రెగ్యులర్ ప్లాన్‌ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు లేదా మధ్యవర్తులకు కమిషన్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల రెగ్యులర్ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్ రేషియో(నిర్వహణ ఖర్చు) డైరెక్ట్ ప్లాన్‌లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.
తాజా నిబంధనల ప్రకారం, నవంబర్ 1 నుంచి ఏఎంసీల డిజిటల్ మాధ్యమాల్లో మదుపర్లు లావాదేవీలు చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా డైరెక్ట్ ప్లాన్ ఎంపిక డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా మధ్యవర్తుల ద్వారా రెగ్యులర్ ప్లాన్‌ను ఎంచుకోవాలనుకుంటే ఆ ప్లాన్‌కు సంబంధించిన అధిక ఎక్స్‌పెన్స్ రేషియో, ఇతర ఖర్చుల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక లాభాలపై ప్రభావం
ఈ మార్పు వల్ల మదుపర్ల దీర్ఘకాలిక సంపద సృష్టిపై గణనీయమైన సానుకూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, తక్కువ ఖర్చులు ఉండే డైరెక్ట్ ప్లాన్లలో మదుపు చేయడం ద్వారా ఏజెంట్ల కమిషన్ భారం తప్పుతుంది. దీనివల్ల కాలక్రమేణా రిటర్న్స్ మెరుగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రెండు దశాబ్దాల కాలంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్)లో చిన్న వ్యత్యాసాలు సైతం కోట్లలో రాబడి తేడాను చూపుతాయి. అందువల్ల మదుపర్లు తాము ఎంచుకునే ప్లాన్ వెనుక ఉన్న వ్యయాలను ముందే అంచనా వేయడానికి ఈ విధానం పారదర్శకతను చేకూరుస్తుంది.
రెగ్యులర్ ప్లాన్‌లు రద్దు కావు
ఈ నిబంధన కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో డిఫాల్ట్ డిస్‌ప్లేను మాత్రమే మారుస్తుందని సెబీ స్పష్టం చేసింది. అంతేతప్ప రెగ్యులర్ ప్లాన్‌లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికే ఉన్న పెట్టుబడుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. మదుపర్లకు ఇప్పటికీ రెగ్యులర్ ప్లాన్‌లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అయితే, మధ్యవర్తుల ద్వారా సర్వీసులు కోరుకునేవారు ఆయా ప్లాన్‌ల అదనపు ఖర్చుల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: 40 వేలమంది భద్రతా సిబ్బంది డేటా లీక్


