న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టదలచిన కంపెనీలు తాజా ఈక్విటీ జారీ పరిమాణంలో 50 శాతంవరకూ సవరించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గడువు పెంచింది. ఇందుకు కొత్తగా ముసాయిదా పత్రాలు దాఖలు చేయకుండానే 2027 మార్చి31వరకూ అనుమతించినట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఏఐబీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది.
తద్వారా అన్లిస్టెడ్ కంపెనీల నిధుల సమీకరణను సులభతరం చేసింది. తొలుత ఈ గడువు 2026 సెపె్టంబర్వరకూ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీలకు అమల్లో ఉండేది. తాజా నిర్ణయంతో ఐపీవో చేపట్టే కంపెనీలు, మర్చంట్ బ్యాంకర్లకు భారీ ఉపశమనాన్ని కల్పిస్తుందని, మారుతున్న బిజినెస్ అవసరాలు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలు చిక్కుతుందని ఏఐబీఐ పేర్కొంది.
గడువు పెంపు మరిన్ని ఐపీవోలకు దారి చూపుతుందని, జూలై–సెప్టెంబర్(క్యూ2)లో భారీ పెట్టుబడులు సమీకరణకు అవకాశమేర్పడిందని తెలియజేసింది. ఈ ఏడాది క్యూ2లో 69 మెయిన్బోర్డు కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 90,482 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క 92 ఎస్ఎంఈలు సైతం రూ. 4,167 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. వెరసి మొత్తం రూ. 94,649 కోట్లు అందుకున్నాయి.


