న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈక్విటీలపై పన్నుల రేట్లను క్రమబదీ్ధకరించాలని కేంద్రానికి పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత స్వరూపంలోని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని, ఎస్‌టీసీజీ, ఎస్‌టీటీ రేట్లలో మార్పులు చేయాలని కోరింది. లాంగ్ టర్మ్ హోల్డింగ్ వ్యవధిని 12 నెలల నుంచి 18–24 నెలలకు పెంచే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
అలాగే, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ)ని తగ్గించాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి రాసిన లేఖలో పీహెచ్‌డీసీసీఐ కోరింది. ఎస్‌టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వల్ల ఈక్విటీ పెట్టుబడులపై రెండు సార్లు పన్ను విధించినట్లవుతుంది కాబట్టి వీటిని క్రమబదీ్ధకరించాల్సిన అవసరం ఉందని వివరించింది. దీని వల్ల నిఖార్సయిన ఇన్వెస్టర్లకు తగిన మినహాయింపులు లభించినట్లవుతుందని పేర్కొంది.
మరోవైపు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ)పై ట్యాక్స్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని లేదా ఎస్‌టీటీ రేట్లను తగ్గించాలని కోరింది. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 3.08 లక్షల కోట్ల పెట్టుబడులను భారత ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. గతేడాది మొత్తం మీద ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్లకు ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్యాక్స్ రేట్లను క్రమబదీ్ధకరిస్తే పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయంగా మారగలదని పీహెచ్‌డీసీసీఐ తెలిపింది.
దండిగా ఎస్‌టీటీ వసూళ్లు...
ప్రస్తుతం లిస్టెడ్ ఈక్విటీలు, ఈక్విటీ ఎంఎఫ్‌లపై విక్రయించగా రూ. 1.25 లక్షలు పైగా రాబడి వస్తే ఎల్‌టీసీజీకి సంబంధించి 12.5 శాతం పన్ను, సర్‌చార్జీ, సెస్సులు విధిస్తున్నారు. వీటికి ఎల్‌టీసీజీ వర్తించాలంటే హోల్డింగ్ వ్యవధి 12 నెలలు పైబడి ఉండాలి. ఒకవేళ 12 నెలల లోపు విక్రయిస్తే 20 శాతం స్థాయిలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టీసీజీ) వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎస్‌టీటీ కింద రూ. 57,522 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 73,700 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 14 మధ్య ఎస్‌టీటీ వసూళ్లు 52 శాతం ఎగిసి రూ. 46,840 కోట్లకు చేరింది.


