ట్రయంఫ్‌ టైగర్‌ 1200.. కొత్త బైక్‌లు వస్తున్నాయ్‌.. | Triumph Tiger 1200 price india launch march 2027 | Sakshi
Sakshi News home page

ట్రయంఫ్‌ టైగర్‌ 1200.. కొత్త బైక్‌లు వస్తున్నాయ్‌..

Oct 29 2026 6:48 PM | Updated on Oct 29 2026 7:07 PM

Triumph Tiger 1200 price india launch march 2027

ట్రయంఫ్‌ మోటార్‌సైకిల్స్‌ ప్రీమియం అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో తన అప్‌డేటెడ్‌ టైగర్‌ 1200 శ్రేణి ధరలను ప్రకటించింది. ఇందులో జీటీ ప్రో వేరియంట్‌ ధర రూ.20.99 లక్షలు కాగా, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌ ధర రూ.23.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు మోడళ్లు భారత్‌లో 2027 మార్చి నుంచి విక్రయానికి రానున్నాయి. ఈ కొత్త బైక్‌లలో ఇంజిన్‌ పనితీరుతో పాటు రైడర్‌ సేఫ్టీ, సస్పెన్షన్‌, కనెక్టివిటీ సదుపాయాలను అప్‌డేట్‌ చేసింది.

మరింత శక్తివంతమైన ఇంజిన్‌

ఈ బైక్‌లో 1,160 సీసీ, లిక్విడ్‌ కూల్డ్‌ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను అప్‌డేట్‌ చేశారు. ఇది గరిష్ఠంగా 158 పీఎస్‌ (సుమారు 156 బీహెచ్‌పీ) పవర్‌ని, 130 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే పవర్‌ 8 పీఎస్‌ పెరిగింది. తక్కువ ఇంజిన్‌ వేగం వద్దనే మెరుగైన టార్క్‌ అందేలా మార్పులు చేయడంతో నెమ్మదిగా ప్రయాణించే సమయంలోనూ, కఠినమైన రహదారులపై కూడా బైక్‌ను నియంత్రించడం సులభం అవుతుంది.

రాడార్‌ ఆధారిత సేఫ్టీ ఫీచర్లు

కొత్త టైగర్‌ 1200లో ముందు, వెనుక బాష్‌ రాడార్‌ వ్యవస్థను అందించారు. దీంతో అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, ముందున్న వాహనంతో ఢీకొనే ప్రమాదంపై హెచ్చరికలు, ఎమర్జెన్సీ బ్రేక్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేకు వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో సదుపాయాలున్నాయి. సెమీ యాక్టివ్‌ షోవా సస్పెన్షన్‌, ఆటోమేటిక్‌ ప్రీలోడ్‌ సర్దుబాటు మరో ప్రత్యేకత. బైక్‌ ఆగినప్పుడు సీటు ఎత్తును సుమారు 30 మిల్లీమీటర్లు తగ్గించే వ్యవస్థ కూడా ఉంది. దీంతో భారీ బైక్‌ను నిలిపే సమయంలో రైడర్లకు మరింత సౌకర్యం కలుగుతుంది.

రెండు వేరియంట్ల మధ్య తేడాలివే..

జీటీ ప్రోలో 20 లీటర్ల ఇంధన ట్యాంక్‌, కాస్ట్‌ అల్యూమినియం వీల్స్‌, ఏడు రైడింగ్‌ మోడ్‌లు ఉంటాయి. ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌లో 30 లీటర్ల ట్యాంక్‌, స్పోక్డ్‌ వీల్స్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, అదనపు ఇంజిన్‌ గార్డులు ఉన్నాయి. దీనికి ప్రత్యేకంగా ఆఫ్‌రోడ్‌ ప్రో మోడ్‌ను కూడా జోడించారు. జీటీ ప్రో బరువు 250 కిలోలు కాగా, ర్యాలీ ఎక్స్‌ప్లోరర్‌ బరువు 268 కిలోలు. రెండు మోడళ్లలోనూ ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల చక్రాలున్నాయి. బ్రెంబో స్టైల్మా కాలిపర్లతో కూడిన బ్రేకింగ్‌ వ్యవస్థను అందించారు.

బీఎండబ్ల్యూకి పోటీగా..

ధరల పరంగా కొత్త టైగర్‌ 1200 శ్రేణి బీఎండబ్ల్యూ ఆర్‌ 1300 జీఎస్‌, ఆర్‌ 1300 జీఎస్‌ అడ్వెంచర్‌ మోడళ్లకు పోటీ ఇవ్వనుంది. వీటి ధరలు వరుసగా సుమారు రూ.24 లక్షలు, రూ.26.50 లక్షలుగా ఉన్నాయి. డుకాటీ మల్టీస్ట్రాడా వీ4 కూడా ఈ విభాగంలో మరో ప్రత్యర్థిగా ఉంది. అధిక శక్తి, రాడార్‌ ఆధారిత భద్రతా సాంకేతికత, సర్దుబాటు చేసుకునే సస్పెన్షన్‌తో సుదూర ప్రయాణాలు చేసే బైక్‌ ప్రియులను ఆకట్టుకోవడమే ట్రయంఫ్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: 3,000 ఎలక్ట్రిక్‌ ట్రక్కులు.. అమెజాన్‌తో టాటా డీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement