సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో గుట్టలుగా పేరుకుపోయిన కేసుల సత్వర పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తులను తిరిగి తాత్కాలిక (అడ్‌హాక్) జడ్జిలుగా నియమించాలన్న ప్రతిపాదన బార్ అసోసియేషన్ల వ్యతిరేకత వల్లే అటకెక్కిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 224ఏ ప్రకారం ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినప్పటికీ, బార్ అసోసియేషన్లు దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేశాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. బార్‌ను అసంతృప్తికి గురిచేసే సాహసాన్ని ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూరి కూడా చేయలేరని వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌కు చెందిన న్యాయాధికారుల సీనియారిటీ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో న్యాయమూర్తుల అపార అనుభవం, పదవీ విరమణ తర్వాత వారి సేవల వినియోగం, పెన్షన్ తదితర అంశాలపై ధర్మాసనం సుదీర్ఘంగా చర్చించింది.
ఆర్టికల్ 224ఏ అమలుకు బ్రేక్
జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే సీజేఐగా ఉన్న సమయంలో రిటైర్డ్ న్యాయమూర్తులను అడ్‌హాక్ జడ్జి లుగా నియమించే పద్ధతిని మళ్లీ అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించడాన్ని జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు మార్గదర్శకాలు సైతం రూపొందించినప్పటికీ బార్ అసోసియేషన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని తెలిపారు. స్థానిక న్యాయవాదులను, బార్‌ను ఇబ్బందిపెట్టి ఈ నియామకాలు చేపట్టేందుకు ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఆసక్తి చూపలేదని ఆయన వివరించారు.
ప్రైవేట్ అవకాశాలు వదులుకొని..
సుప్రీంకోర్టు చొరవతో తమకు అడ్‌హాక్ న్యాయమూర్తులుగా అవకాశం వస్తుందన్న అంచనాలతో చాలామంది రిటైర్డ్ జడ్జిలు ఆర్బిట్రేషన్, ఇతర ప్రైవేట్ అసైన్‌మెంట్లు అంగీకరించకుండా ఉండిపోయారని న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ల అభ్యంతరాలతో ప్రణాళిక ఆగిపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయాధికారుల పెన్షన్ అంశం కూడా ప్రస్తావనకు వచి్చంది. చాలా ఏళ్ల పాటు సేవలందించి, అనివార్య కారణాలతో రాజీనామా చేసిన ఒక న్యాయాధికారికి నెలకు కేవలం రూ.25,000 పెన్షన్ వస్తోందని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. కొద్దిపాటి మొత్తంతో ఒక అధికారి ఎలా జీవించగలరని ప్రశ్నించారు. దీనిపై సీనియర్ న్యాయవాది పీఎస్ పట్వాలియా స్పందిస్తూ.. కనీసం న్యాయాధికారుల పెన్షన్ అంశాన్నైనా సానుభూతితో పరిశీలించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పెన్షన్ అనేది వ్యక్తిగత ఆర్థిక భద్రత మాత్రమే కాదని, అది న్యాయవ్యవస్థ స్వాతంత్య్రంతో ముడిపడి ఉన్న అంశమని జస్టిస్ బాగ్చీ వెల్లడించారు. న్యాయమూర్తులు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వతంత్రంగా పనిచేసేందుకు ఆర్థిక భద్రత అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: రెండేళ్లలో 40 విల్లాలు, కాటేజీలు : ఐఏఎస్‌పై సంచలన ఆరోపణలు
అమెరికా జడ్జిల నిరాడంబరతపై చర్చ
భారత న్యాయవ్యవస్థలో నెలకొన్న వీఐపీ సంస్కృతి, బ్యూరోక్రాటిక్ పోకడలతో పాటు అమెరికా కోర్టుల పనితీరుపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. రిటైర్డ్ న్యాయమూర్తులు కూడా అక్కడ కోర్టుల్లో అవసరాన్ని బట్టి సేవలందిస్తుంటారని జస్టిస్ బాగ్చీ చెప్పారు. అమెరికా జడ్జిల నిరాడంబరతను న్యాయ మూర్తులు ప్రస్తావించారు. కౌంటర్ టెర్రరిజం ప్రోగ్రామ్ కోసం గతంలో అమెరికా వెళ్లినప్పుడు అక్కడి జస్టిస్ స్టీవెన్స్‌ను కలిసిన సంఘటనను జస్టిస్ బాగ్చీ పంచుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన కోసం ప్రత్యేక కారు, కాన్వాయ్ వస్తాయని తాము ఆశిస్తే, వర్షంలో ఒక గొడుగు పట్టుకుని ట్యూబ్ ట్రైన్‌లో సాధారణ పౌరుడిలా రావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.


