నవంబర్‌ 1 నుంచి ఫోన్‌లో కొత్త రూల్‌! ఇక కాలర్‌ పేరు కూడా.. | New Caller ID Rule India November 1 | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 1 నుంచి ఫోన్‌లో కొత్త రూల్‌! ఇక కాలర్‌ పేరు కూడా..

Oct 30 2026 1:15 PM | Updated on Oct 30 2026 1:25 PM

New Caller ID Rule India November 1

మన ఫోన్‌కు రోజూ ఎన్నో తెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వస్తుంటాయి. అవతలి వ్యక్తి ఎవరో తెలియక కొందరు కాల్స్‌ లిఫ్ట్‌ చేయడానికి వెనుకాడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా నవంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త సేవ అందుబాటులోకి రానుంది. ఫోన్‌లో సేవ్‌ చేయని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినా.. ఆ నంబర్‌ ఎవరి పేరుతో నమోదైందో స్క్రీన్‌పై కనిపించనుంది.

కేంద్ర టెలికాం శాఖ ఆదేశాల మేరకు కాలర్‌ నేమ్‌ ప్రెజెంటేషన్‌ (CNAP) సేవను అమల్లోకి తీసుకురానున్నారు. ఈ సేవ ద్వారా కాల్‌ చేసిన వ్యక్తి పేరు ఫోన్‌ స్క్రీన్‌పై కనిపించేలా ఏర్పాట్లు చేయాలని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లను శాఖ ఆదేశించింది. ప్రస్తుతం 4జీ, 5జీతో పాటు అంతకంటే ఆధునిక నెట్‌వర్క్‌లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. ఇందుకోసం వినియోగదారులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఫోన్‌లో ఆ నంబర్‌ను ఇప్పటికే సేవ్‌ చేసుకుంటే.. కాంటాక్ట్స్‌లో ఉన్న పేరే కనిపిస్తుంది. ఒకవేళ నంబర్‌ సేవ్‌ చేయకపోతే, సిమ్‌ తీసుకునే సమయంలో టెలికాం సంస్థ వద్ద నమోదు చేసిన పేరు స్క్రీన్‌పై చూపించనున్నారు. అంటే సిమ్‌ ఎవరి పేరుతో నమోదైందో ఆ వివరాల ఆధారంగా కాలర్‌ పేరు కనిపిస్తుందని అధికారులు తెలిపారు.

అయితే ఈ సదుపాయం ప్రస్తుతానికి 4జీ, 5జీ నెట్‌వర్క్‌లకే పరిమితం కానుంది. 2జీ, 3జీ ఫోన్లకు ఈ సేవను తర్వాత అందుబాటులోకి తీసుకురావడంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో, సేవ్‌ చేయని నంబర్లకు వ్యక్తి పేరు బదులుగా ఇంటర్నేషనల్‌ కాల్‌ (International Call) అని కనిపించేలా ఏర్పాటు చేయనున్నట్లు టెలికాం శాఖ పేర్కొంది.

తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో కాలర్‌ వివరాలను తెలుసుకునేందుకు ఈ సేవ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇతరుల పేర్లతో ఫోన్‌ చేసి మోసాలకు పాల్పడే ఘటనలను అరికట్టడంలో ఈ విధానం తోడ్పడుతుందని టెలికాం శాఖ తెలిపింది. అయితే స్క్రీన్‌పై పేరు కనిపించినంత మాత్రాన ఆ కాల్‌ నమ్మదగినదని భావించకూడదు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండటం అవసరం.

ఇదీ చదవండి: బినాన్స్‌పై సైబర్‌ దాడి.. బిట్‌కాయిన్‌ సహా క్రిప్టోల పతనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement