బెంగళూరు: కర్ణాటకలో స్థానికుల ఉద్యోగ హక్కుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ఐటీ, బయోటెక్నాలజీ (బీటీ) కంపెనీల్లో కన్నడిగులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్న ఆరోపణలతో ఓ కన్నడ అనుకూల సంస్థ ఉద్యమానికి సిద్ధమైంది. నవంబర్ 1 నుంచి నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు కర్ణాటక రక్షణ వేదిక (కరవే) ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీ, బీటీ కంపెనీలను సంస్థ ప్రతినిధులు సందర్శించనున్నారు. ఆయా సంస్థల్లో కన్నడిగులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలపై వివరాలు సేకరించడంతో పాటు స్థానిక అభ్యర్థుల పట్ల వివక్ష లేకుండా నియామకాలు చేపట్టాలని యాజమాన్యాలను డిమాండ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం కరవే పలు బృందాలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో బృందంలో 10 మంది నాయకులు, కార్యకర్తలు ఉంటారు. వీరు కంపెనీల అధిపతులు, మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్) అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు. కంపెనీల్లో ప్రస్తుతం ఎంతమంది కన్నడిగులు పనిచేస్తున్నారు? స్థానికులకు ఉద్యోగాలు కల్పించేందుకు అనుసరిస్తున్న విధానాలేంటి? అర్హతలు ఉన్నప్పటికీ కన్నడిగులకు అవకాశాలు ఎందుకు రావడం లేదు? అనే అంశాలపై వివరణ కోరనున్నారు.
ఐటీ రంగంలో కన్నడిగులు ప్రతిభావంతులైన నిపుణులని, వారికి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంస్థ పేర్కొంది. నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, స్థానిక అభ్యర్థుల పట్ల వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది. కంపెనీ యాజమాన్యాల నుంచి వివరాలు సేకరించడంతో పాటు స్థానిక ఉద్యోగులు, ఉద్యోగార్థుల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరించనుంది. కర్ణాటకలోని భూమి, నీరు, విద్యుత్, రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాల వల్ల ప్రయోజనం పొందుతున్న కంపెనీలు స్థానికుల ఉపాధి ఆకాంక్షలను కూడా గౌరవించాలని కరవే పేర్కొంది. కన్నడిగులకు ఉద్యోగాల విషయంలో జరిగే అన్యాయాన్ని సహించబోమని హెచ్చరించింది.
సీఎం హెచ్చరికతో మరింత చర్చ
ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇదే అంశంపై స్పందించారు. బెంగళూరులోని ఐటీ కంపెనీలు స్థానిక కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా ఉద్యోగాలకు దూరం పెడుతున్నాయన్న ఫిర్యాదులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అక్టోబర్ 25న ఎక్స్ వేదికగా వెల్లడించారు. స్థానికులకు అన్యాయం జరుగుతున్నట్లు తేలితే ప్రైవేటు సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కన్నడిగుల హక్కులు, గౌరవం, ఉద్యోగ అవకాశాల విషయంలో రాజీ పడబోమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరవే చేపట్టనున్న నెల రోజుల కార్యక్రమం కర్ణాటకలోని ఐటీ, బీటీ రంగాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: బద్దలైన హిమ సరస్సు.. భారత్ వైపు దూసుకొస్తున్న వరద ముప్పు!


