రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్‌కు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. శిఖర్ అగర్వాల్‌ను 'అవైటింగ్ పోస్టింగ్ ఆర్డర్' (APO) కింద ఉంచుతూ ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఆయన, ఆయన భార్య (ఐపీఎస్ అధికారి ప్రశాఖ మథుర్), వారి ఇద్దరు కుమారులు, అత్తమామలు కలిసి రెండున్నరేళ్ల కాలంలో ఒకే కంపెనీ నుంచి 40 విల్లాలు, కాటేజీలను కొనుగోలు చేశారనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
బుధవారం అర్ధరాత్రి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అగర్వాల్‌ను పరిపాలనా కారణాల రీత్యా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు APO కింద ఉంచారు. అగర్వాల్‌పై ఆరోపణలకు సంబంధించిన వివరాలను ఒక స్థానిక పత్రిక బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాస్, ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి అఖిల్ అరోరా కూడా ఇంకా స్పందించలేదు.అలాగే దీనిపై విచారణ లేదా అంతర్గత దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక ధృవీకరణ ఏదీ రాలేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారులలో ఒకరైన అగర్వాల్, గతంలో సీఎంఓలో పనిచేశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుధాంశు పంత్‌తో విభేదాలు వచ్చినట్లు వార్తలు రావడంతో ఆయనను సీఎంఓ నుంచి తొలగించారు. అధికారుల బదిలీలు, ఫైళ్లను పక్కన పెట్టడంపై వీరిద్దరి మధ్య నడిచిన వివాదం ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పంత్ కేంద్ర డెప్యుటేషన్‌కు వెళ్లడానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నప్పటికీ, 2027 ఫిబ్రవరిలో శ్రీనివాస్ రిటైర్మెంట్ తర్వాత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్న వారిలో అగర్వాల్ ఒకరు. ఈ పోటీలో అభయ్ కుమార్, అఖిల్ అరోరా, అపర్ణ అరోరా ఉండగా, మరో పోటీదారు రజత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం కేంద్ర డెప్యుటేషన్‌లో ఉన్నారు.
ఇదీ చదవండి: 15 అడుగుల గోతిలో 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల కొద్దీ డబ్బు
కాగా అగర్వాల్ పరిశ్రమలు, MSME, ప్రణాళిక, ఇతర శాఖల అదనపు ముఖ్య కార్యదర్శి (ACS)గా ఉండగా, అంతకుముందు రాజస్థాన్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి సంస్థ (RIICO) ఛైర్మన్‌గా, RAJSICO మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇదీ చదవండి: షేక్ హసీనా వీడియో : ఆ అధికారి అనుమానాస్పద మృతి కలకలం


