సాక్షి, న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‍తో ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం (అక్టోబర్ 10) ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిర్వహించ తలపెట్టిన నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. తక్కువ సమయంలో దరఖాస్తు చేయడం, గతంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం,ప్రస్తుతం ఉన్న శాంతిభద్రతల పరిస్థితిని కారణంగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిరసన చేపట్టేందుకు అనుమతి కోరుతూ సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ దరఖాస్తు సమర్పించినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ నూపుర్ ప్రసాద్ తెలిపారు.
నిబంధనల ప్రకారం కనీసం 10 రోజుల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉండగా, చాలా తక్కువ సమయంలో దరఖాస్తు చేశారని పోలీసులు వీరి దరఖాస్తును తిరస్కరించారు. పైగా గతంలో అనుమతి పొందిన నిరసనల సమయంలో పార్టీ చట్టపరమైన ఆదేశాలను, తన సొంత హామీలను పాటించడంలో విఫలమైందని పోలీసులు వాదిస్తున్నారు. దీనికి తోడు న్యూఢిల్లీ ప్రాంతంలో సెక్షన్ 163 అమలులో ఉంది. దీనిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు జంతర్ మంతర్ వద్ద ముందస్తు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించారు. అలాగే, శుక్రవారం రాత్రి నుండి న్యూఢిల్లీ జిల్లాలోని 57 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ను పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగం వద్దని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న బార్బర్
గతంలో నీట్‌లో అక్రమాలు, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో అప్పటి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ఉద్యమం కోసం సీజేపీ అనుమతినిచ్చిన ఢిల్లీ పోలీసులు తాజాగా అనుమతిని నిరాకరించడం గమనార్హం. కాగా జంతర్ మంతర్ వద్ద తన కార్యక్రమానికి ప్రజలు ఎవరూ హాజరుకావద్దంటూ ఢిల్లీ పోలీసులు పిలుపు ఇవ్వడంపై సీజేపీ మండిపడింది. ఢిల్లీ పోలీసుల ధర్నాకు రావొద్దంటూ పిలుపు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఇటీవల ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్ చైన్ కొట్టేసింది : యూట్యూబర్ మధుమితపై కేసు


