ఫ్లైదుబాయ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌ | Flydubai Incident: Gaza Motive Israels Shoot Down Plan Revealed | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్‌ ఘటనలో బిగ్‌ ట్విస్ట్‌.. మరో షాకింగ్‌ విషయం!

Oct 6 2026 10:43 AM | Updated on Oct 6 2026 10:58 AM

Flydubai Incident: Gaza Motive Israels Shoot Down Plan Revealed

ఆ విమానంలో 170 మందికిపైగా ప్రయాణికులు.. వారిలో ఎక్కువమంది ఇజ్రాయెల్‌ పౌరులు. దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న విమానం ఒక్కసారిగా వేల అడుగుల మేర కిందికి పడిపోయింది. కాక్‌పిట్‌లో పైలట్‌పై కో-పైలట్‌ దాడి చేశాడు. విమానం అదుపు తప్పుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో ప్రయాణికులు, సిబ్బంది ధైర్యంగా స్పందించకపోయి ఉంటే పెను విషాదమే జరిగేది. ఇప్పుడు ఈ ఘటనపై దర్యాప్తులో వరుసగా కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. 

ప్లైదుబాయ్‌ ఘటనను ఉగ్ర దాడిగా అటు యూఏఈ, ఇటు ఇజ్రాయెల్‌లు ప్రకటించాయి. పైగా అల్‌ఖైదా స్పందనతో హమామ్‌ అల్‌-హమ్మామీ ఆ సంస్థలోనే ట్రైనింగ్‌ తీసుకుని ఉంటాడని దాదాపుగా అంచనాకు వచ్చారు. ఈ తరుణంలో ఓ బిగ్‌ ట్విస్ట్‌ బయటపడింది.  “గాజా ప్రతీకారం కోసం చేశాను.. అమరుడిగా చనిపోవాలనుకున్నా” అంటూ కో-పైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ విచారణలో చెప్పినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. అదే సమయంలో విమానం ఇజ్రాయెల్‌ వైపు కొనసాగి ఉంటే.. ప్రయాణికులతో నిండిన ఆ విమానాన్ని కూల్చివేయడానికి కూడా ఇజ్రాయెల్‌ సిద్ధమైందన్న విషయం వెలుగులోకి వచ్చింది.

గాజా ప్రతీకారం కోసమా?
ఫ్లైదుబాయ్‌ ఘటనలో ఇరాన్‌ కోణంపై అమెరికా, ఇజ్రాయెల్‌లు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే దర్యాప్తులో మాత్రం కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. విచారణలో హమామీ “గాజాకు ప్రతీకారంగా చేశాను. అమరుడిగా చనిపోవాలనుకున్నాను” అని చెప్పినట్లు సమాచారం. దీనిని దర్యాప్తు అధికారులు గనుక ధృవీకరిస్తే..  కీలక సమాధానమే దొరికినట్లవుతుంది. అయితే హమామీ ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? ఎవరైనా అతడిని ప్రేరేపించారా? ఎవరైనా సంస్థ అతడిని ఉపయోగించుకుందా? ప్రయాణాలు, పరిచయాలు, విదేశాల్లో ఎవరెవరిని కలిశాడు? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌ దర్యాప్తు వర్గాలు దీనిని లొన్‌-వోల్ఫ్‌ దాడి అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాయట. 

ముందే స్కెచ్‌ వేశాడా?
హమామీ విచారణలో మరో సంచలన విషయం కూడా బయటకొచ్చింది. హమామీ ఫ్లైదుబాయ్‌లో చేరకముందే ఈ దాడికి ప్రణాళిక వేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. విమానాన్ని చివరకు టెల్‌అవీవ్‌లోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో కూల్చేయాలన్నది అతడి ఉద్దేశమని ఆ అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. అంతేకాదు.. టెల్‌అవీవ్‌కు వెళ్లే విమానాల్లో పని చేసే అవకాశం కోసం అతడు ఫ్లైదుబాయ్‌లో చేరాడా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దీంతో.. ఇది అకస్మాత్తుగా జరిగిన దాడి కాదా? ముందే లక్ష్యాన్ని ఎంచుకుని పథకం ప్రకారం చేశాడా? అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

విమానం కూల్చేందుకు ఇజ్రాయెల్‌ రెడీ!
ఇక ఈ ఘటనలో మరో ఉత్కంఠభరితమైన విషయం తాజాగా బయటపడింది. విమానం కాక్‌పిట్‌లో దాడి జరిగిన తర్వాత అది సుమారు 14 వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఇజ్రాయెల్‌ వైమానిక దళం కాక్‌పిట్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన రాలేదు. దీంతో అక్కడి అధికారులు 9/11 తరహా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందే రూపొందించుకున్న ప్రోటోకాల్‌ను అమల్లోకి తెచ్చారు. కమాండ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి.. యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. ఇజ్రాయెల్‌ గగనతలాన్ని కూడా మూసివేశారు.

విమానం ఇజ్రాయెల్‌కు సుమారు 400 మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఎఫ్‌జెడ్‌1073 విమానం ఇజ్రాయెల్‌ వైపు కాకుండా సౌదీ అరేబియా వైపు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలను వెనక్కి పిలిచింది. సౌదీ కూడా తన యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.

170 మందికిపైగా ఉన్నా.. అదే చివరి నిర్ణయం!
అయితే విమానం ఇజ్రాయెల్‌ వైపే కొనసాగి ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. విమానం హైజాక్‌ అయిందని నిర్ధారణై, కాక్‌పిట్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే యుద్ధ విమానాలు దాని దగ్గరకు వెళ్లి కాక్‌పిట్‌, ప్రయాణికుల పరిస్థితిని పరిశీలించేవి. ఆ తర్వాత కూడా ముప్పు కొనసాగితే రక్షణ మంత్రి, ప్రధానమంత్రితో అత్యవసర చర్చ జరిగేది.

అక్కడే అత్యంత కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. ఇజ్రాయెల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం.. నియంత్రణలో లేని విమానం కీలక ప్రాంతాల వైపు దూసుకొస్తోందని నిర్ధారణ అయితే దాన్ని కూల్చివేసే అవకాశం ఉంది. ఆ తుది నిర్ణయం ప్రధానమంత్రిదే. ప్రయాణికులతో నిండిన విమానం కూల్చడం కంటే.. అది టెల్‌అవీవ్‌లోని విమానాశ్రయం లేదంటే ఇతర కీలక ప్రాంతాన్ని ఢీకొట్టి వందల మందిని చంపే ప్రమాదాన్ని అడ్డుకోవడమే ఈ విధానం ఉద్దేశమని ఇజ్రాయెల్‌ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ఇచ్చింది.

చివరి నిమిషంలో పెను ప్రమాదం తప్పింది
ఇదంతా జరుగుతున్న సమయంలో కాక్‌పిట్‌లో మాత్రం మరో పోరాటం సాగుతోంది. హమామీ దాడిలో గాయపడిన భారత పైలట్‌ స్మిట్‌ మచ్చార్‌ అతడిని అడ్డుకోవడానికి పోరాడాడు. చివరకు కాక్‌పిట్‌ తలుపు తెరవగలిగాడు. దీంతో ప్రయాణికులు, ఫ్లైదుబాయ్‌ సిబ్బంది లోపలికి వెళ్లి హమామీని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ఉన్న ఇద్దరు ఆఫ్‌-డ్యూటీ పైలట్లు నియంత్రణ చేపట్టారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ఫ్లైదుబాయ్‌ ఘటన వెనుక దాగి ఉన్న కొత్త కోణాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాయి. దాడి వెనుక అతడొక్కడే ఉన్నాడా? ఎవరైనా అతడిని నడిపించారా? అన్నది తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి: హమామీ క్లియరెన్స్‌పై ఒమన్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement