ఫ్లైదుబాయ్ ఘటనపై కేంద్రం సీరియస్.. ఎన్ఐఏ కేసు నమోదు | Central Govt takes serious view of Flydubai incident NIA registers case | Sakshi
Sakshi News home page

ఫ్లైదుబాయ్ ఘటనపై కేంద్రం సీరియస్.. ఎన్ఐఏ కేసు నమోదు

Oct 10 2026 4:51 PM | Updated on Oct 10 2026 5:11 PM

Central Govt takes serious view of Flydubai incident NIA registers case

సాక్షి,న్యూఢిల్లీ: ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్‌పై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసింది. విమానాన్ని హైజాక్ చేయడానికి, కూల్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో యాంటీ హైజాకింగ్ చట్టం-2016, ఉపా (UAPA) చట్టం-1967 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానంలో భారత కెప్టెన్ స్మిట్‌ మచ్చార్‌ను ఒమన్‌కు చెందిన కో-పైలట్ కాక్‌పిట్‌లో కత్తితో పొడిచినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ దాడిలో కెప్టెన్ తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రయాణికులు, సిబ్బంది కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకోగా, ఇతర పైలట్లు విమాన నియంత్రణ చేపట్టి సౌదీ అరేబియాలోని తబుక్‌లో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం సౌదీ అధికారులు కో-పైలట్‌ను అరెస్టు చేశారు.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం-2008లోని సంబంధిత నిబంధనల ప్రకారం దర్యాప్తు చేపట్టాలని కేంద్రం ఆదేశించినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే దాడికి గల కారణాలు ఏమిటన్నది మాత్రం ఇంకా వెల్లడికాలేదు. కుట్రలో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు కూడా ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించలేదు.

ఇక గాయపడిన కెప్టెన్ స్మిట్‌ మచ్చార్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అబుదాబిలో శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం కెప్టెన్ కుటుంబ సభ్యులు, వైద్యులతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement