విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం | CJP leaders detained on the flight itself by women police | Sakshi
Sakshi News home page

విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం

Oct 10 2026 2:45 PM | Updated on Oct 10 2026 2:59 PM

CJP leaders detained on the flight itself by women police

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అబిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగానే సుమారు డజను మంది మహిళా పోలీసులు విమానంలోకి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

విమానంలో ఇరుకైన మార్గాలు ఉండటం, పురుష పోలీసుల జోక్యంతో ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతోనే మహిళా పోలీసులను పంపి ఉండవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పోలీసులు ఈ వ్యూహాన్ని ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా ఇంకేదైనా కారణంతో చేశారా అనేది స్పష్టంగా తెలియలేదు.

ఈ ఏడాది జూలై 20న పరీక్ష పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పురుష పోలీసులు అక్కడ ఉన్న యువతులపై దాడి చేశారంటూ సీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్బంధంలో మహిళా పోలీసులను ఉపయోగించడం ద్వారా ఉద్రిక్తతలు తగ్గించడంతోపాటు మరో వివాదం తలెత్తకుండా అధికారులు ప్రయత్నించి ఉండవచ్చని భావిస్తున్నారు.

400 మందికి పైగా నిర్బంధం
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ పార్టీ నేతలు మాత్రం నిరసనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, రత్నా సింగ్ సహా 400 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement