ప్రతీకాత్మక చిత్రం
అనర్హుల చేతుల్లోకి పేదల బియ్యం
కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు
దేశంలో 13.2 శాతం మంది అనర్హులకు ఉచిత ఆహార ధాన్యాలు
సాక్షి, న్యూఢిల్లీ: సొంతంగా కార్లు, ఏసీలు.. మూడు అంతకంటే ఎక్కువ గదులున్న పక్కా ఇళ్లు.. కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా సకల సౌకర్యాలతో దర్జాగా ఉన్న కొన్ని కుటుంబాలు పేదలుగా చలామణి అవుతూ ఉచిత రేషన్ బియ్యాన్ని నెలనెలా పొందుతున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎఫ్‌ఎస్‌ఏ) కింద అమలవుతున్న ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)’ పథకంలో భారీ స్థాయిలో అనర్హులు ఉన్నట్లు తాజా అధ్యయనంతో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా లబ్ధిదారుల్లో సగటున 13. 2 శాతం మంది అనర్హులే ఉన్నారని ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ సమగ్ర అధ్యయనం జరిగింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 51,303 లబ్ధిదారుల కుటుంబాలను సర్వే చేశారు.
పట్టణాల్లోనే ఎక్కువగా అనర్హులు..
నివేదికలోని వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అనర్హుల శాతం 12.5గా ఉంది. ఇది పట్టణ ప్రాంతాల్లో 15. 6 శాతంగా నమోదైంది. అత్యంత నిరుపేదలైన అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డులో 12.2 శాతం, ప్రాధాన్యత కుటుంబాల్లో 13.4 శాతం మంది అనర్హులు గుర్తించారు. 2025–26లో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.4.69 లక్షల కోట్ల సబ్సిడీ భరించగా అందులో దాదాపు సగం అంటే రూ. 2.28 లక్షల కోట్లు ఒక్క ఆహార సబ్సిడీకే ఖర్చు అవుతోంది.
అత్యధిక అనర్హులున్న రాష్ట్రాలు
పశ్చిమ బెంగాల్ (39.5%), త్రిపుర (39.2%), తమిళనాడు (38.7%), మేఘాలయ (28.5%), బిహార్ (25.5%), ఒడిశా (22.9%), పంజాబ్ (20.6%), మహారాష్ట్ర (20.3%).
ఇదీ చదవండి: లెక్కల్లోనే తగ్గిన పేదరికం
మెరుగైన పనితీరు కనబరిచిన రాష్ట్రాలు
జమ్మూ కశ్మీర్ (0.3%), మధ్యప్రదేశ్ (0.5%), హరియాణా (1.0%), ఢిల్లీ (1.0%), రాజస్థాన్ (1.8%). ఈ రాష్ట్రాల్లో డిజిటలైజేషన్, లబ్ధిదారుల వడపోత పకడ్బందీగా జరగడంతో అనర్హుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.


