కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) పరిధిలో పనిచేస్తున్న సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్లు తమ దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త ఆందోళనకు దిగారు. మూడు దశాబ్దాలకు పైగా సర్వీసు అందించినప్పటికీ కొందరు అధికారులు కేవలం ఒక్క ప్రమోషన్‌తోనే పదవీ విరమణ చేయాల్సిన దుస్థితి నెలకొందని ‘ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ సూపరింటెండెంట్స్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్’ (ఏఐఏఎస్‌సీటీ) ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 27 వరకు దేశవ్యాప్తంగా విధులకు హాజరవుతూ నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన తెలుపుతున్నారు.
సీనియారిటీ జాబితాలు, డీపీసీపై ప్రతిష్ఠంభన
సూపరింటెండెంట్ కేడర్‌లో 2014, 2015 సంవత్సరాలకు సంబంధించిన అఖిల భారత సీనియారిటీ జాబితాలను (ఏఐఎస్‌ఎల్) ఖరారు చేసి ప్రచురించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అసోసియేషన్ ఆరోపిస్తోంది. ఈ జాబితాలు కొలిక్కి రాకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ పదోన్నతుల కోసం నిర్వహించాల్సిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు, 2026లో సీబీఐసీ మానవ వనరుల విభాగం (డీజీహెచ్‌ఆర్‌డీ) పాత జాబితాల (2007-13) సవరణలపై ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, 2014-15 జాబితాలపై స్పష్టత రాలేదు. సకాలంలో డీపీసీలు నిర్వహించాలన్న కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ మోడల్ క్యాలెండర్ మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.
క్యాడర్ పునర్వ్యవస్థీకరణ
2014 తర్వాత సమగ్ర క్యాడర్ పునర్వ్యవస్థీకరణ జరగకపోవడంతో పదోన్నతుల అవకాశాలు సన్నగిల్లాయని పేర్కొంటూ 2026 సెప్టెంబర్ 24న సీబీఐసీ ఛైర్మన్‌కు ఏఐఏఎస్‌సీటీ 83 పేజీల ప్రతిపాదనలను సమర్పించింది. అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ప్రైమరీ ఎగ్జిక్యూటివ్ సర్కిళ్ల ఏర్పాటు, ప్రత్యేక సెంట్రల్ ట్యాక్స్ సర్వీస్ రూపకల్పన వంటి అంశాలను ఇందులో సూచించింది. వీటితో పాటు తాత్కాలిక పదోన్నతుల క్రమబద్ధీకరణ, నాన్-ఫంక్షనల్ అప్‌గ్రేడేషన్ మంజూరు, 1996 నాటి వేతన సమానత్వ బకాయిల చెల్లింపు, కోర్టు తీర్పుల ఏకరీతి అమలును సంఘం డిమాండ్ చేస్తోంది.
ఉధృతం కానున్న ఉద్యమం
ఈ ఆందోళనకు ఇన్‌స్పెక్టర్ల సంఘం, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సంపూర్ణ సంఘీభావం ప్రకటించాయి. భోపాల్ కార్యవర్గ సమావేశ నిర్ణయం మేరకు ప్రస్తుత నిరసనలు సాగుతుండగా ప్రభుత్వం స్పందించకపోతే డిసెంబర్ 9న దేశవ్యాప్తంగా భోజన విరామ సమయంలో గేట్ మీటింగ్‌లు నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏఐఏఎస్‌సీటీ హెచ్చరించింది.
ఇదీ చదవండి: సారొచ్చారు.. బంగారాన్ని పెంచారు!


