సీజేపీ నిరసనకు సోనమ్ వాంగ్‌చుక్ దూరం! కారణం ఇదే.. | Sonam Wangchuk Skips CJP Protest At Jantar Mantar, Urges Unity And Peaceful Demonstrations, Watch Video Inside | Sakshi
Sakshi News home page

సీజేపీ నిరసనకు సోనమ్ వాంగ్‌చుక్ దూరం! కారణం ఇదే..

Oct 10 2026 3:25 PM | Updated on Oct 10 2026 3:42 PM

Sonam Wangchuk stays away from CJP protest At Delhi

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 10న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతిపాదించిన నిరసనకు ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హాజరుకాలేదు. హిమాలయ ప్రాంతంలో నీటి భద్రత, హిమానీనద సరస్సుల విపత్తుల ముప్పు నివారణ పనుల్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు.

ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌ వేదికగా వాంగ్‌చుక్ స్పందించారు. కృత్రిమ హిమానీనదాల నిర్మాణం ద్వారా నీటి కొరతను అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హిమాలయ ప్రాంతంలో 200కు పైగా హిమానీనద సరస్సుల వల్ల ముప్పు పొంచి ఉంది. వాటి నుంచి రక్షణకు సంబంధించిన ప్రయోగాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

రాజకీయాలకు అతీతంగా దేశం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితను ఆయన ఉటంకించారు. ‘‘నిరసనలో పాల్గొనే వారు ఐక్యంగా ఉండాలి. ముఖ్యంగా యువత ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిని పాటించాలి. మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించాలి’’ అని పిలుపునిచ్చారు.

గతంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు
జూలైలో పరీక్షల అక్రమాల ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనకు వాంగ్‌చుక్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జంతర్ మంతర్ వద్ద 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అనంతరం జూలై 23న గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో దీక్ష విరమించారు.

ఇక తాజా నిరసనకు ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అబిజీత్ దీప్కే, సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఢిల్లీ పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. నిరసన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇదీ చదవండి: విమానంలోనే సీజేపీ నేతల నిర్బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement