చరిత్ర సృష్టించిన పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా.. | VHT: Devdutt Padikkal Creates History Becomes 1st Batter To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు

Jan 12 2026 6:42 PM | Updated on Jan 12 2026 7:43 PM

VHT: Devdutt Padikkal Creates History Becomes 1st Batter To

దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముంబైతో క్వార్టర్‌ ఫైనల్లోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ దుమ్ములేపాడు. సెంచరీ మిస్‌ చేసుకున్నా సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించాడు.

బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్‌ ఫైనల్‌లో కర్ణాటక- ముంబై (Karnataka vs Mumbai) జట్లు సోమవారం తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.

షామ్స్‌ ములాని అర్ధ శతకం
ఓపెనర్లు అంగ్‌క్రిష్‌ రఘువన్షి (27), ఇషాన్‌ ముల్‌చందాని (20) ఓ మోస్తరుగా ఆడగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్‌ ఖాన్‌ (9) ఈసారి విఫలమయ్యాడు. కెప్టెన్‌ సిద్దేశ్‌ లాడ్‌ 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హార్దిక్‌ తామోర్‌ (1) నిరాశపరిచాడు.

ఇలాంటి దశలో ఆల్‌రౌండర్‌ షామ్స్‌ ములాని అద్భుత అర్ధ శతకం (86)తో జట్టును ఆదుకున్నాడు. మిగిలిన వారిలో సాయిరాజ్‌ పాటిల్‌ (25 బంతుల్లో 33 నాటౌట్‌) రాణించడంతో ముంబై చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కర్ణాటక బౌలర్లలో విద్యాధర్‌ పాటిల్‌ మూడు వికెట్లు తీయగా.. విధ్వత్‌ కావేరప్ప, అభిలాష్‌ శెట్టి చెరో రెండు.. విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

రాణించిన పడిక్కల్‌.. కరుణ్‌ నాయర్‌
ఇక లక్ష్య ఛేదనలో కర్ణాటకకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (12)ను మోహిత్‌ అవస్థి పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ 81 పరుగులతో రాణించగా.. కరుణ్‌ నాయర్‌ 74 పరుగులతో అతడితో కలిసి అజేయంగా నిలిచాడు.

అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన కారణంగా VJD (వి.జయదేవన్‌) మెథడ్‌లో.. 33 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 187 పరుగులు చేసిన కర్ణాటక.. 55 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో సెమీస్‌కు దూసుకువెళ్లింది.

చరిత్ర సృష్టించిన పడిక్కల్‌
ఈ సీజన్‌లో పడిక్కల్‌ ఇప్పటికే 721 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ దేశీ వన్డే టోర్నీలో అత్యధికసార్లు 700 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2021-22 సీజన్‌లో దేవదత్‌ పడిక్కల్‌ ఏడు ఇన్నింగ్స్‌ ఆడి 737 పరుగులు సాధించాడు.

ఇక ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నారాయణ్‌ జగదీశన్‌ (2022-23లో 8 ఇన్నింగ్స్‌లో 830 పరుగులు) కొనసాగుతున్నాడు. ముంబై తరఫున 2021-22 సీజన్‌లో పృథ్వీ షా 827 పరుగులు చేసి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. 

చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement