
భారత షూటర్లకే స్వర్ణ, రజత, కాంస్యాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌ను భారత షూటర్లు ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు భారత షూటర్లు మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. టాప్–3లో భారత షూటర్లే నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. అనుష్క ఠాకూర్ పసిడి పతకం నెగ్గగా... అన్షిక రజత పతకాన్ని, ఆద్య అగర్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
అనుష్క 621.6 పాయింట్లతో అగ్రస్థానంలో, అన్షిక 619.2 పాయింట్లతో రెండో స్థానంలో, ఆద్య 615.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కే చెందిన సానియా 610.9 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా... నిమ్రత్ కౌర్ 604.3 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని సంపాదించింది. మరోవైపు జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి.
దీపేంద్ర సింగ్ షెకావత్ 617.9 పాయింట్లతో రజత పతకం నెగ్గగా... రోహిత్ కన్యాన్ 616.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. స్వతంత్ర అథ్లెట్‌గా పోటీపడ్డ రష్యా షూటర్ కామిల్ నురిఖెమెతోవ్ 618.9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు.