సూపర్‌ శ్రీహరి | Indian swimmer wins three medals in a single day | Sakshi
Sakshi News home page

సూపర్‌ శ్రీహరి

Sep 29 2025 4:15 AM | Updated on Sep 29 2025 4:16 AM

Indian swimmer wins three medals in a single day

ఒకే రోజు మూడు పతకాలు నెగ్గిన భారత స్విమ్మర్‌

ఆసియా అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 

అహ్మదాబాద్‌: పదహారేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ తెరదించాడు. ఆసియా అక్వాటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఒకేరోజు భారత్‌కు మూడు పతకాలు అందించి అబ్బురపరిచాడు. ఆదివారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో శ్రీహరి పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు నెగ్గగా... 4 x 100 మీటర్ల మెడ్లీ రిలే ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన భారత బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. 

2020 టోక్యో ఒలింపిక్స్, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 24 ఏళ్ల శ్రీహరి... 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఫైనల్‌ను 1ని:48.47 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. హైబో జు (చైనా; 1ని:46.83 సెకన్లు) స్వర్ణం... హినాటో అండో (జపాన్‌; 1ని:48.73 సెకన్లు) కాంస్యం సాధించారు. 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్‌ను శ్రీహరి 25.46 సెకన్లలో ముగించి రెండో స్థానాన్ని సంపాదించాడు. 

గుకైలాల్‌ వాంగ్‌ (చైనా; 25.11 సెకన్లు) స్వర్ణం... ములున్‌ చువాంగ్‌ (చైనీస్‌ తైపీ; 25.50 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. రిషభ్‌ దాస్, లిఖిత్‌ సెల్వరాజ్, బెనెడిక్షన్‌ బెనిస్టన్, శ్రీహరి నటరాజ్‌ సభ్యులుగా ఉన్న భారత బృందం 4x100 మీటర్ల మెడ్లీ ఫైనల్‌ను 3ని:40.87 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు పోటీలు ముగిశాక చైనా 11 స్వర్ణాలు, 2 కాంస్యాలతో కలిపి 13 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో ఉండగా... భారత్‌ మూడు పతకాలతో ఆరో స్థానంలో ఉంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement