
అభివాదం చేస్తున్న గంగుల, మధుసూదనాచారి, గుజ్జ కృçష్ణ, శ్రీనివాస్‌గౌడ్, దత్తాత్రేయ, వీహెచ్, ఆర్.కృష్ణయ్య, వాకిటి శ్రీహరి, జైపాల్‌యాదవ్, చెరుకు సుధాకర్ తదితరులు
రాష్ట్ర పరిధిలో చేయాల్సిందంతా చేశాం
బీసీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి
రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు: ఎంపీ వద్దిరాజు
రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
సాక్షి, హైదరాబాద్ /లక్డీకాపూల్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులకు విద్య, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిందన్నారు. దాన్ని రాష్ట్రపతికి పంపించామని, ఆర్డినెన్స్ జారీ చేసి రాష్ట్ర గవర్నర్‌కు పంపించామని, అయితే వాటికి ఆమోదం రాకపోవడం బాధాకరమని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కానప్పటికీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
ఆదివారం లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ‘బీసీ రిజర్వేషన్లు సాధించాలన్న కసి మనందరికీ ఉంది. ఇప్పుడు సాధించకుంటే భవిష్యత్‌లో సాధించడం అసాధ్యమనిపిస్తోంది. రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా బీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు కలిసి ఉద్యమించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. గతంలో తమిళనాడులో జయలలిత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ఆమోదం తెలిపింది.
ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టి 6 నెలలు కావొస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. బీసీలకు న్యాయం జరగాలని బండి సంజయ్ ఇంటికి వెళ్లి మరీ కలిసి పోరాటం చేద్దామన్నాను. కాంగ్రెస్ పార్టీకే క్రెడిట్ వస్తుందని మద్దతు తెలపడం లేదు’అని చెప్పారు.
⇒ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ‘బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ రాజ్యాంగ సవరణతోనే సాధ్యమవుతుంది. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చిన తర్వాతే రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుంది. ఈ విషయం తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది’అని చెప్పారు.
⇒ ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ‘వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు దక్కాలంటే తెగించి పోరాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ అడ్వొకేట్‌లను నియమిస్తే కేసు తప్పకుండా గెలిచే అవకాశం ఉంది’ అన్నారు.
⇒ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ ‘రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలి. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. విద్య, ఉద్యోగ, వైద్య రంగంలో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలి’అన్నారు.
ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వీహెచ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.