- ప్రపంచకప్ చెస్ చాంపియన్‌గా ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్
- ఈ టైటిల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు
పనాజీ: ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. బుధవారం ముగిసిన పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో 19 ఏళ్ల సిందరోవ్ చాంపియన్‌గా అవతరించాడు. తద్వారా ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయసు్కడిగా సిందరోవ్ గుర్తింపు పొందాడు. చైనా గ్రాండ్‌మాస్టర్ వె యితో జరిగిన టైబ్రేక్‌లో సిందరోవ్ 1.5–0.5తో గెలుపొందాడు. ఇద్దరి మధ్య నిరీ్ణత రెండు క్లాసిక్ ఫార్మాట్ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో... విజేతను నిర్ణయించేందుకు బుధవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తెల్ల పావులతో ఆడిన తొలి గేమ్‌ను సిందరోవ్ 45 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
నల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌లో సిందరోవ్ 60 ఎత్తుల్లో గెలుపొంది టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. విజేతగా నిలిచిన సిందరోవ్‌కు 1,20,000 డాలర్లు (రూ. 1 కోటీ 7 లక్షలు), రన్నరప్ వె యికి 85,000 డాలర్లు (రూ. 75 లక్షల 83 వేలు), మూడో స్థానం పొందిన ఎసిపెంకో (రష్యా)కు 60,000 డాలర్లు (రూ. 53 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ ముగ్గురు వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించారు. ఫాబియానో కరువానా (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ) ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందారు. క్యాండిడేట్స్ టోర్నీ విజేత ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడతాడు.


