
గుకేశ్ చేతిలో ఓటమి అనంతరం కార్ల్‌సన్ వ్యాఖ్య
జాగ్రెబ్: ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ మునుపటిలా తాను చెస్ ఆడటాన్ని ఆస్వాదించలేకపోతున్నానని చెప్పాడు. ఓ దశాబ్దంపాటు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకున్న కార్ల్‌సన్ ఇటీవల భారత టీనేజ్ సంచలనం, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోతున్నాడు. ఇక్కడ జరుగుతున్న సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో గురువారం రెండోసారి గుకేశ్ చేతిలో కంగుతిన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆటపై ఆసక్తి తగ్గి బలహీన ప్లేయర్‌గా మారుతున్నానని వ్యాఖ్యానించాడు.
అయితే ప్రపంచ చాంపియన్ గుకేశ్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అవకాశాల్ని ఒడిసిపట్టుకోవడం, సందర్భోచిత ఎత్తులు వేయడంలో అతని ఆటతీరు గొప్పగా ఉందన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే... ఇప్పుడు నేను చెస్ ఆడటాన్ని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాను. ఎత్తులు, పైఎత్తులపై ఆసక్తి సన్నగిల్లుతోంది. చెస్ బోర్డు ముందు కూర్చొని ఆడేటపుడు నాలో ఎలాంటి అనుభూతి కలగడం లేదు. అందుకే ఆటలో పేలవంగా ఆడుతున్నాను’ అని నార్వే సూపర్ స్టార్ అన్నాడు.
2013 నుంచి 2023 వరకు ప్రపంచ చెస్‌ను శాసించిన ఈ సూపర్ గ్రాండ్‌మాస్టర్ బరిలో ఉన్న పదేళ్లు టైటిల్‌ను నిలబెట్టుకోవడం విశేషం. రెండేళ్ల క్రితం కార్ల్‌సన్ స్వయంగా వైదొలగడంతోనే డింగ్ లిరెన్ (చైనా) చాంపియన్ అయ్యాడు. ఇతన్ని గతేడాది ఓడించిన గుకేశ్ సరికొత్త చాంపియన్‌గా అవతరించాడు.