
భారత్ ఖాతాలో మహిళల వరల్డ్ కప్ టైటిల్
తుది పోరులో దివ్య దేశ్‌ముఖ్‌తో హంపి ‘ఢీ’
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్‌కు చెందిన ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు చేరగా... గురువారం దివ్య సరసన భారత దిగ్గజం కోనేరు హంపి కూడా చేరింది. చైనా గ్రాండ్‌మాస్టర్ లె టింగ్జితో జరిగిన రెండో సెమీఫైనల్లోఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపి టైబ్రేక్‌లో 4–2 పాయింట్లతో... ఓవరాల్‌గా 5–3 పాయింట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్‌కు చేరింది.
ఈ గెలుపుతో హంపి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. బుధవారం నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత హంపి, లె టింగ్జి 1–1తో సమంగా ఉన్నారు. దాంతో విజేతను తేల్చేందుకు గురువారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా ర్యాపిడ్ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు జరిగాయి. అయితే ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో ఇద్దరూ 2–2తో సమంగా నిలిచారు. అనంతరం ర్యాపిడ్ ఫార్మాట్ లోనే మరో రెండు గేమ్‌లు నిర్వహించారు.
తొలి గేమ్‌లో లె టింగ్జి 65 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 39 ఎత్తుల్లో గెలిచింది. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి వీరిద్దరి మధ్య బ్లిట్జ్ ఫార్మాట్‌లో రెండు గేమ్‌లు నిర్వహించారు. ఈ రెండు గేముల్లోనూ హంపి నెగ్గి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి గేమ్‌లో హంపి 70 ఎత్తుల్లో, రెండో గేమ్‌లో 33 ఎత్తుల్లో గెలుపొందింది. హంపి, దివ్య మధ్య ఈనెల 26, 27వ తేదీల్లో ఫైనల్ జరుగుతుంది. రెండు గేమ్‌లలో ఫలితం తేలకపోతే 28న టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.

2 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు చేరడం హంపికిది రెండోసారి. 2011లో మ్యాచ్ ఫార్మాట్‌లో నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హంపి ఫైనల్ చేరి చైనా గ్రాండ్‌మాస్టర్ హు ఇఫాన్ చేతిలో ఓడిపోయింది.