గ్లాస్గో (స్కాట్లాండ్): ఊహించిన విధంగానే 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులు భారత్ దక్కించుకుంది. ఈ మేరకు కామన్వెల్త్ స్పోర్ట్ కార్యవర్గం బుధవారం వివరాలు వెల్లడించింది. కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు గత నెలలోనే అహ్మదాబాద్‌ను వేదికగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించగా... ఇప్పుడు కార్యవర్గం దానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డొనాల్డ్ రుకరే ఆతిథ్య హక్కుల పత్రాలు అందజేశారు.
దీంతో రెండు దశాబ్దాల తర్వాత భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 2010 కామన్వెల్త్ గేమ్స్ ఢిల్లీలో జరిగాయి. ‘కామన్వెల్త్ గేమ్స్ కోసం తదుపరి వేదిక ఖరారైంది. భారత్ ఈ క్రీడలకు కొత్త అభిరుచి, మరింత ఔచిత్యం తీసుకొస్తుందని విశి్వసిస్తున్నాం. గొప్ప సంస్కృతిని కొనసాగిస్తూ క్రీడల స్థాయిని పెంచుతుంది’ అని కామన్వెల్త్ స్పోర్ట్ అధ్యక్షుడు డొనాల్డ్ రుకరే అన్నారు.
కామన్వెల్త్ స్పోర్ట్ నిర్ణయాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్వాగతించారు. ‘ఇది గరి్వంచే క్షణం. 2047 కల్లా టాప్–5 క్రీడా దేశాల్లో భారత్ ఒకటిగా ఎదుగుతుంది’ అని మాండవీయ పేర్కొన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్న భారత్‌కు కామన్వెల్త్ క్రీడల నిర్వహణ మంచి రిహార్సల్ కానుంది. 2030 కామన్వెల్త్ క్రీడల కోసం అహ్మదాబాద్‌తో పాటు... నైజీరియా నగరం అబుజా కూడా పోటీపడింది. అయితే
నిర్వాహకులు మాత్రం భారత్‌నే ఎంపిక చేశారు. అబుజాను 2034 కామన్వెల్త్ క్రీడల కోసం పరిగణించనున్నారు.


