గుజరాత్‌లో ఉగ్ర కుట్రకు సూత్రధారి, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌పై దాడి జరిగింది. ప్రస్తుతం అహ్మదాబాద్ శివారులోని సబర్మతి జైలులో ఉన్న అతడిపై తోటి ఖైదీలు దాడి చేసి చితకబాదారు. ఈ దాడిలో అతని ముఖానికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
జోన్ 2 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మద్ సయ్యద్‌ను జైల్లోని హైసెక్యూరిటీ సెల్‌లో ఉంచారు. అయితే ఈ కేసులో తనతో పాటే అరెస్టైన అజాద్, సుహాయిల్‌తో సయ్యద్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో ముగ్గురు ఖైదీలు అనిల్ కుమార్, శివమ్ శర్మ, అంకిత్ లోడీ జోక్యం చేసుకుని సయ్యద్‌పై ఓ కర్రతో దాడికి దిగారు.
ఈ దాడిలో సయ్యద్ ముఖానికి గాయాలు కావడంతో చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. దాడికి పాల్పడిన ఖైదీలు ఒకరు హత్య కేసులో నిందితుడు కాగా.. మరొకర ఆర్థిక నేరంలో, ఇంకొకరు పోక్సో కేసులో శిక్ష అనుభవిస్తున్నారుఅసలు దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నెల అనగా నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాదిగా దాదాపు నిర్ధారణ అయ్యింది.
ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలని భావించిన మొహియుద్దీన్ స్కెచ్ గీశాడు. చైనాలో ఎంబీబీఎస్ చదవిన మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నాడు.
అహ్మదాబాద్ ఏటీఎస్ అహ్మద్‌తో పాటు అరెస్టైన మరో ఇద్దరిని విచారించింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొహియుద్దీన్.. మరో ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుంటాడని విచారణలో తెలిసింది. అబూ ఖాదీమ్ పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడని.. దర్యాప్తులో వెల్లడైంది.


