అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు
వృద్ధి 4.6 శాతానికి పరిమితం
న్యూఢిల్లీ: అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన వృద్ధి 4.6 శాతానికి పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే అత్యల్ప వృద్ధి కావడం గమనార్హం. నిత్యావసరాల నుంచి ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ వరకు దాదాపు 375 ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లను తగ్గించడం దీనికి నేపథ్యం.
శనివారం కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం గతేడాది అక్టోబర్‌లో నమోదైన రూ. 1.87 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే ఈసారి అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు 4.6 శాతం వృద్ధితో రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. స్థానిక అమ్మకాల తీరుతెన్నులను సూచించే స్థూల దేశీ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై పన్నులు 13 శాతం పెరిగి రూ. 50,884 కోట్లకు ఎగిశాయి. జీఎస్‌టీ రిఫండ్‌లు వార్షికంగా 39.6% పెరిగి రూ. 26,934 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను కూడా సర్దుబాటు చేయగా నికర జీఎస్‌టీ ఆదాయం 0.2 % వృద్ధితో రూ. 1.69 లక్షల కోట్లుగా నమోదైంది.
పండగ సీజన్ దన్ను..
పండగ సీజన్ అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి పేరుకుపోయిన డిమాండ్‌ను అక్టోబర్ జీఎస్‌టీ గణాంకాలు ప్రతిబింబించాయి. దీపావళికి ముందు జీఎస్‌టీ రేట్లను తగ్గించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవం నాటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో, రేట్లు తగ్గే వరకు వేచి చూద్దామనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా జీఎస్‌టీ రేట్లను తగ్గించడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జీఎస్‌టీ వసూళ్ల సగటు వృద్ధి సుమారు 9 శాతంగా నమోదైంది. ఆగస్టులో వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ. 1.86 లక్షల కోట్లుగా, సెప్టెంబర్‌లో 9.1 శాతం వృద్ధితో రూ. 1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
క్రమంగా పెరుగుతున్న డిమాండ్..
దేశీయ జీఎస్‌టీ వసూళ్లు స్వల్పంగా పెరగడాన్ని బట్టి చూస్తే, డిమాండ్ క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందని ప్రైస్ వాటర్‌హౌస్ అండ్ కో పార్ట్‌నర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జీఎస్‌టీ రిఫండ్లు నిలకడగా పెరగడాన్ని చూస్తే, భవిష్యత్తులో కూడా జీఎస్‌టీ వసూళ్ల వృద్ధి సానుకూలంగా ఉంటుందని ఆదాయ పన్ను శాఖ విశ్వసిస్తోన్నట్లుగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు.
రేట్ల క్రమబదీ్ధకరణ, పండగ సీజన్‌కి ముందు వినియోగదారులు ఖర్చులను వాయిదా వేసుకోవడమనేది జీఎస్‌టీ వసూళ్ల వేగం నెమ్మదించడంలో ప్రతిఫలించినట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. ఇది ముందుగా ఊహించినదేనని, తదుపరి నెలలో మళ్లీ పుంజుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను పాటించడంలో (కాంప్లియెన్స్) క్రమశిక్షణ మెరుగుపడుతుండటాన్ని, వ్యాపారాలకు రుణలభ్యత సులభతరం కావడాన్ని రీఫండ్ల పెరుగుదల సూచిస్తోందని ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్ పార్ట్‌నర్ వివేక్ జలాన్ తెలిపారు. దిగుమతి ఆధారిత ఐజీఎస్‌టీ వసూళ్లు సుమారు 12 శాతం పెరగడమనేది ముడి వస్తువులు, క్యాపిటల్ గూడ్స్‌కి ఆరోగ్యకరమైన డిమాండ్ నెలకొనడాన్ని, పారిశ్రామికోత్పత్తి పటిష్టతను సూచిస్తోందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి పెద్ద రాష్ట్రాలు ఈ వృద్ధికి దన్నుగా నిల్చాయని వివరించారు.
చిన్న వ్యాపారాలకు 3 రోజుల్లోనే రిజి్రస్టేషన్..
తక్కువ రిసు్కలు ఉండేవి, చిన్న వ్యాపారాలు 3 పని దినాల్లోనే జీఎస్‌టీ రిజి్రస్టేషన్ పొందే విధంగా జీఎస్‌టీ విభాగం నవంబర్ 1 నుంచి సరళతర విధా నాన్ని అమల్లోకి తెచ్చింది. డేటా అనాలిసిస్ ఆధారంగా జీఎస్‌టీ సిస్టం గుర్తించిన చిన్న వ్యాపారులు, తమ ఔట్‌పుట్ ట్యాక్స్ లయబిలిటీ నెలకు రూ. 2.5 లక్షలకు మించదని సెల్ఫ్–అసెస్‌మెంట్ చేసుకున్న వారు ఈ స్కీమ్‌ని ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగానే దీన్ని ఎంచుకోవచ్చు. దీన్నుంచి వైదొలగవచ్చు. సరళతరమైన కొత్త జీఎస్‌టీ రిజి్రస్టేషన్ స్కీముతో 96 శాతం మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం జీఎస్‌టీ కింద 1.54 కోట్ల వ్యాపారాలు నమోదు చేసుకున్నాయి.


