దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు ఆడేందుకు భారత్‌కు రానుంది. తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. అయితే నవంబర్ 22 నుంచి 25 వరకు గౌహతి వేదికగా సౌతాఫ్రికా-భారత్ మధ్య జరగనున్న రెండో టెస్టులో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది.
సాధారణంగా రెడ్ బాల్ (టెస్ట్) క్రికెట్ మ్యాచ్‌లలో మొదటి సెషన్ తర్వాత లంచ్, రెండో సెషన్ తర్వాత టీ బ్రేక్ తీసుకుంటారు. కానీ భారత్-సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్‌లో మాత్రం ఆటగాళ్లు తొలుత టీ బ్రేక్.. ఆ తర్వాత లంచ్ విరామానికి వెళ్లనున్నారు. నార్త్ ఈస్ట్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా ఉండటం కారణంగా.. రెడ్ బాల్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆటగాళ్లు లంచ్‌కు ముందు టీ బ్రేక్ తీసుకోనున్నారు.
చరిత్రలో తొలిసారి..
ఒక టెస్టు మ్యాచ్ ఆర్డర్ చాలా సింపుల్. తొలుత టాస్, ఆ తర్వాత ఆట ప్రారంభం, లంచ్ బ్రేక్, టీ బ్రేక్, స్టంప్స్. కానీ గౌహతీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరగనుంది.
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. బర్సపారా స్టేడియంలో ఆట ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. అంటే సాధారణ సమయం కంటే అరగంట ముందుగా మొదలు కానుంది. మొదటి సెషన్ ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగుతుంది. తరువాత 20 నిమిషాల టీ విరామం ఉంటుంది.
రెండవ సెషన్ ఉదయం 11:20 నుండి మధ్యాహ్నం 1:20 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆటగాళ్ళు 40 నిమిషాల భోజన విరామం తీసుకుంటారు. చివరి సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. రోజులోని 90 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అంపైర్‌లు ప్రయత్నించనున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఈ షెడ్యూల్ మార్పుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది.
చదవండి: IPL 2026: ఆ జట్టు హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్!?


