breaking news
Sakshi Exclusive
-
సోలో మహిళా బైకర్ ...సరికొత్త రికార్డ్...
పురుషులతో సమానంగా బైక్ రైడింగ్‌లో మహిళలు దూసుకుపోతున్నారు. ఆకాశమే హద్దుగా రికార్డులు తిరగరాస్తున్నారు. అదే క్రమంలో పూణేకు చెందిన సోలో ఉమెన్ బైకర్ ఐశ్వర్య నాగర్కర్(32) అలియాస్ సఖి–రైడర్ని తన 350సిసి బైక్‌పై స్వర్ణ చతుర్భుజి హైవేపై ప్రయాణం (గోల్డెన్ క్వార్డిలేటరల్ హైవే జర్నీ) సాగిస్తున్నారు. యంగెస్ట్ ఇండియన్ మదర్ గా గతంలో ఏ మహిళా సోలో రైడర్ సాధించిన ఘనత కాకపోవడం గమనార్హం. ఈ ఘనత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బూన్ ఆఫ్ రికార్డ్‌లలో నమోదు కానుంది. గత 6వ తేదీన పూణెలో ప్రారంభమైన ఈ జర్నీ దాదాపుగా 6వేల కిమీ కొనసాగనుందని బెంగళూరు, చెన్నై, నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నం నగరాల మీదుగా సాగి తూర్పు ఉత్తర భారత ప్రాంతాల్లో పూర్తి సర్క్యూట్ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 22న పూణేకు తిరిగి చేరుకుంటానని గృహిణి, 8ఏళ్ల కూతురుకి తల్లి కూడా అయిన ఐశ్వర్య చెప్పారు. బైక్ రైడ్ కొనసాగిస్తూనే ‘సాక్షి’తో ముచ్చటించిన ఆమె పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...తెలుగువాళ్ల ఆదరణ మరువలేను..నా బైక్ జర్నీ ప్రారంభమైన 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలుకు చేరుకున్నాను. అలాఅలా విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం, శ్రీకాకుళం పట్టణాల మీదుగా ప్రయాణించాను. ఈ సందర్భంగా పలు చోట్ల స్థానికులతో సంభాషించాను ప్రతీ చోటా అక్కడి సమస్యలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాలపై వారితో ముచ్చటించాను. నన్ను స్వంత ఇంటి మనిషిలా ఆదరించిన వారి ఆత్మీయత మరచిపోలేను. నా జర్నీ సందర్భంగా ఇంకా చాలా మంది మహిళలు సంకోచాలతో తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారని అర్ధమైంది. సేవతో మిళితం చేస్తూ...నా బైక్ రైడింగ్ ఇతరుల కంటే వేగంగా ప్రయాణించడమో, రికార్డుల సృష్టికే పరిమితం కాదు... ఇతరులు నా కోసం నిర్దేశించిన పరిమితులను దాటి ప్రయాణించడం నా లక్ష్యం. దీనిని సేవతో మిళితం చేస్తూ సాగుతున్నా. మహారాష్ట్రలోని ఫోఫ్సండి జిల్లా పరిషత్ పాఠశాల సహా పలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధుల కు అండగా ఉండేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. వారికి ఆర్ధిక చేయూత అందించేందుకు విరాళాలు సేకరించడానికి రైడర్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహోద్యోగులను సమీకరిస్తుంటాను.కూతురి కోసం మట్టి సేకరణ...నా ఈ తాజా ప్రయాణంలో అద్భుతమైన వ్యక్తులను కలిశాను ప్రతి రాష్ట్రం ఎంత అందంగా ఉంటుందో గమనించాను అంతేకాదు నేను ప్రయాణించే ప్రతి రాష్ట్రం నుంచి గుప్పెడు మట్టిని సేకరిస్తానని నా కుమార్తెకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేశా. ఎందుకంటే మన దేశం సంస్కృతిలో... ఆహారంలో, భాషలో, సుసంపన్నమైనది. కానీ దేశపు నిజమైన ఆత్మ దాని మట్టిలోనే ఇమిడి ఉంటుందని నా అభిప్రాయం నేను ఆమెకు ఈ మట్టి జాడీలను ఇచ్చినప్పుడు, భారతదేశం మొత్తం ఆమె ఇల్లేనని... ఆకాశమే ఆమె హద్దు అనే నమ్మకాన్ని కూడా బహుమతిగా ఇస్తాను కేవలం మట్టి మాత్రమే కాదు, నేను ప్రయాణించే రహదారుల నుంచి ధైర్యం, నేను స్పృశించే భూమి నుంచి ఆశీర్వాదాలు, నేను కలిసే వ్యక్తుల నుంచి జ్ఞాపకాలను సేకరిస్తూ ముందుకు సాగుతున్నాను. నా ప్రయాణం కిలోమీటర్ల లెక్క గురించి కాదు, ఇది నా దేశంతో అనుసంధానం కావడం గురించి, అది పంచిన ప్రేమను ఇంటికి తీసుకురావడం గురించి.మహిళకు స్ఫూర్తిగా..నేను నా కోసం, నా కూతురి కోసం, తాను కూడా ఎవరూ ఊహించనంత దూరం ప్రయాణించగలనని నిరూపించే ప్రతి మహిళ కోసం ఈ రైడ్ చేస్తున్నాను. ఒక మహిళ బలం పరిమితుల ద్వారా నిర్వచించలేం, వాటిని ఛేదించే ధైర్యం ద్వారా మాత్రమే నిర్వచించవచ్చు. ఇది వారికి చూపించడమే నా లక్ష్యం. నేను సంచరించే ప్రతి రహదారి, మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా భయం లేకుండా సంచరించే ప్రపంచం వైపు ఒక అడుగు. ఇతర మహిళలు వారి శక్తిని విశ్వసించడానికి, వారి కలలను సాకారం చేసుకోవడానికి వారి స్వంత మార్గాన్ని సృష్టించుకునేలా నా ప్రయాణాల ద్వారా, ప్రేరేపించాలనేది నా ఆలోచన. నా మోటార్‌సైకిల్ కేవలం ఒక యంత్రం కాదు అది నా స్వరం, నా స్వేచ్ఛ, సాధికారత పట్ల నా నిబద్ధత. ప్రతి మైలుతో, మహిళలు తమ సొంత మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారిని ఎవరూ ఆపలేరనే సందేశాన్ని నాతో మోసుకెళ్తున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా, నా భర్త మద్దతు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదు. నేను 15 రోజులు ఇంట్లో ఉండడం లేదంటే ఇలా రోడ్ల మీద ప్రయాణిస్తుంటే మా కూతురి బాగోగులు తాను చూసుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు , నా అత్తమామలు కూడా తమ చేతనైనంతగా నాకు మద్దతు ఇస్తున్నారు. అదే విధంగా ప్రతీ మహిళ తనను తాను నిరూపించుకునేందుకు కుటుంబం అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను.::Satya Babu -
Sakshi Exclusive: అప్పన్న సన్నిధిలో అవినీతి గోడ నిర్మాణంపై షాకింగ్ నిజాలు
-
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు.


