- తేనె సరఫరాలో నిర్లక్ష్యాన్ని గుర్తించిన విజిలెన్స్
- ఫోమిక్ యాసిడ్ పాత కంటైనర్లలో తేనె సరఫరా
- పంపాలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ తనిఖీల్లో లోపాలపై నోటీసులు
- తాజాగా సరఫరా అయిన తేనెను పక్కనపెట్టాం
- తేనెలో రసాయనాలపై ఇంకా పరీక్షలు జరగాలి
- కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశాం: శబరిమల ఈవో బైజు
- తేనె కల్తీలో కుట్రకోణంపై పోలీసుల ఆరా
- ల్యాబ్ పరీక్షల తర్వాత దర్యాప్తు జరిపే చాన్స్
పథనంతిట్ట: సరిగ్గా మూడేళ్ల క్రితం శబరిమల అయ్యప్పస్వామికి నైవేద్యం పెట్టేందుకు తయారు చేసే అరవణ పాయసంలో వాడే యాలకుల్లో పురుగు మందు అవశేషాలున్నట్లు తేలడం అప్పట్లో కలకలం రేగింది. సరిగ్గా అలాంటి లోపాలే ఇప్పుడు అయ్యప్పస్వామి అభిషేకానికి, ప్రసాదాల తయారీకి ఉపయోగించే తేనెలో లోపాలున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) విజిలెన్స్ విభాగం గుర్తించింది. అంతేకాదు.. అయ్యప్ప స్వామి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను పకడ్బందీగా తనిఖీ చేయడానికి పంపాబేస్‌లో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ సేఫ్టీ ల్యాబ్’ ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తేల్చింది.
ఫోమిక్ యాసిడ్ కంటైనర్లలో తేనె..
చీమలు, తేనెటీగలు మనల్ని కుట్టినప్పుడు విపరీతమైన మంట కలగడానికి కారణం అవి విడుదల చేసే ఫోమిక్ యాసిడ్. అయితే.. కృత్రిమంగా తయారు చేసే ఫోమిక్ యాసిడ్‌ను రబ్బరు ప్రాసెసింగ్, శానిటైజర్ల తయారీ, పురుగుమందుల్లో వినియోగిస్తారు. ఇలాంటి ఫోమిక్ యాసిడ్‌ను నిల్వ చేసేందుకు ఉపయోగించిన కంటైనర్లు, డబ్బాలను ఆహార పదార్థాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఫోమిక్ యాసిడ్ అవశేషాలతో ఆహారపదార్థాలు విషపూరితమవుతాయి. ఫోమిక్ యాసిడ్ కంటైనర్లను ఎంతగా శుభ్రపరిచినా.. వాటిల్లో రసాయన అవశేషాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆహార భద్రత ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధమంటున్నారు.
విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది?
పంపాలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లో పనిచేసే రిసెర్చ్ అధికారి తన పరిశీలనలో తప్పుడు నివేదిక ఇచ్చినట్లు విజిలెన్స్ నిగ్గుతేల్చింది. అయ్యప్ప ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థాల విషయంలో తనిఖీ డొల్లగా ఉందని పేర్కొంది. ఫోమిక్ యాసిడ్ కంటైనర్ల హిస్టరీని తనిఖీ చేయకపోవడం.. సరఫరా సంస్థ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. దీంతో కాంట్రాక్టర్‌కి షోకాజ్ నోటీసును జారీ చేసింది. కాంట్రాక్టర్ నుంచి సమాధానం వచ్చిన తర్వాత తగిన చర్యలు ప్రారంభిస్తామని శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బైజు విలేకరులకు తెలిపారు. ప్రస్తుతానికి కొత్త స్టాక్ వినియోగాన్ని నిలిపివేశామని, అయ్యప్ప అభిషేకాలకు, ప్రసాదాల తయారీకి ఇప్పటికే స్టోర్‌లో నిల్వ ఉన్న స్టాక్‌ను వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. శబరిమల స్వర్ణ తాపడం వివాదం మరువక ముందే ఇలాంటి మరో ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది.
ఇది కూడా చదవండి: శబరిమల గోల్డ్ కేసు: ఏపీకి లింకు..! నటుడు జయరాంను ప్రశ్నించే చాన్స్


