నగరాభివృద్ధిలో మౌలిక వసతుల రూపకల్పనే కీలకం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరాభివృద్ధిలో సవాళ్లను అధిగమించాలంటే మౌలిక వసతుల రూపకల్పన ఎంతో ముఖ్యమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జన సాంద్రతకు అనుగుణంగా రవాణా, తాగునీరు, మురుగు నీరు, విద్యుత్, శాంతిభద్రతల వ్యవస్థలు పెరగాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే క్రమంలో ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను, ప్రజాభిప్రాయాలను కచ్చితంగా అధికార పార్టీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఆదివారం బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌లో నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్‌లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యం, ఎక్స్‌పర్ట్ మహీప్ సింగ్ థాపర్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ కె.రమేష్ బాబు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్.కె.జోషి మాట్లాడుతూ.. భారీ జనాభా ఉన్న నగరాల్లో ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, చైన్నె తరువాత హైదరాబాద్ ఉందన్నారు. కొత్తగా చేరిన పురపాలికలతో ఇప్పుడు నగర విస్తీర్ణం చాలా పెరిగిందన్నారు. దాదాపు రెండు వేల కిలోమీటర్లలో నగరం విస్తరించనుందన్నారు. అయితే సాంకేతికతను, ఏఐను వినియోగించుకోవడంతోపాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గ్రీన్ ఏరియాలను పెంచడంతోపాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టంపై దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ డెవలవర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో వక్తలు


