పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్
చేవెళ్ల/షాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. డివిజన్‌లోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమంలో సరి చూసుకొని ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఓటింగ్ శాతం నమోదు చేయాలని స్టేజ్–2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు కృష్ణయ్య, అన్వర్, ఏసీపీ కిషన్, ఎంపీడీఓలు హిమబిందు, అపర్ణ, మండల ప్రత్యేకాధికారులు వెంకటేశ్వర్‌రావు, మధుసూదన్ తదితరులు ఉన్నారు. అన్ని కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ నిర్వహించారు.
శంకర్‌పల్లిలో డీసీపీ
శంకర్‌పల్లి: మహాలింగాపురం గ్రామంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


