కవులు, రచయితలకు సాహితీ ప్రక్రియలో శిక్షణ అవసరం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలుగు రాష్ట్రాలలోని కవులు, రచయితలకు సాహితీ ప్రక్రియలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్ రాములు అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఽభారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ యశోద గొట్టిపర్తి రాసిన ‘యశోకాంక్ష కథల సంపుటి, యశో బాలానందం, శ్రీ వెంకటేశ్వర స్వామితో నేను’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ... రచయిత్రి ఎంతో అంకిత భావంతో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఈ పుస్తకాలు రాశారని అన్నారు. ఈ పుస్తకాలు సాహితీ చరిత్రలో అక్షర దీపాలుగా మిగిలిపోతాయన్నారు. కళారత్నా డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.విజయలక్ష్మీ పండిట్, డాక్టర్ వి.డి రాజగోపాల్, రామకృష్ణ చంద్రమౌలి, డాక్టర్ రాధా కుసుమ, డాక్టర్ కోగంటి ఉషారాణి, డాక్టర్ శాంతి శ్రీ, పద్మ శ్రీలత, జల్ది విద్యాధర్ పాల్గొన్నారు.


