విమానయాన సంస్థల తీరుపై సుప్రీంకోర్టు విస్మయం
తాము జోక్యం చేసుకుంటామని వ్యాఖ్య
న్యూఢిల్లీ: పండుగల రద్దీని అవకాశంగా తీసుకుని విమాన ప్రయాణ ఛార్జీలను అమాంతంగా పెంచేయడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చార్జీలను ఆకస్మిక పెంచి విమానయాన సంస్థలు సాగిస్తున్న దోపిడీపై జోక్యం చేసుకోక తప్పదని స్పష్టం చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా పెంచుతున్న చార్జీలు, అదనపు రుసుములను నియంత్రించడానికి తగు మార్గదర్శకాలను రూపొందించాలంటూ దాఖలైన పిల్‌పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘మేం ఈ విషయంలో కచ్చితంగా జోక్యం చేసుకుంటాం. కుంభమేళా, ఇతర పండగల సమయాల్లో ప్రయాణి కులను ఎలా దోచుకుందీ చూశాం. తాజాగా, ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్, జోథ్‌పూర్‌లకు చార్జీలను ఆకస్మికంగా పెంచేశారు’అని ధర్మాసనం పేర్కొంది. విమాన ప్రయాణ చార్జీల్లో పారదర్శకత, ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలంటూ సామాజిక కార్యకర్త లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్‌పై గతేడాది నవంబర్ 17వ తేదీన విచారణ చేపట్టిన ధర్మాసనం..కేంద్రం, డీజీసీఏ తదితరులకు నోటీసులు జారీ చేసింది.
సోమవారం విచారణ సందర్భంగా సమాధానం ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ కౌశిక్ కోరడంతో ధర్మాసనం తదుపరి విచా రణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు గతంలో 25 కిలోల వరకు లగేజీని ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండగా ప్రైవేట్ విమానయాన సంస్థలు దాన్ని 15 కిలోలకు ఏకపక్షంగా తగ్గించి వేశాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమాన చార్జీలను, ఇతర అదనపు రుసుములను సమీక్షించేందుకు గానీ, గరిష్ట పరిమితిని నిర్ణయించేందుకు గానీ అధికారం ఏ వ్యవస్థకూ లేకపోవడంతో విమానయాన సంస్థలు వివిధ రూపాల్లో ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఆరోపించారు.


