సాక్షి, కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కబరస్తాన్(స్మశానం)లో ఓ దృశ్యం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ యువతి గత మూడు రోజులుగా అక్కడి నుంచి కదలడం లేదు. కుటుంబ సభ్యులు సైతం ఆమెను కదిలించే ప్రయత్నం చేయకపోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే..
ఈ ఘటన వెనుక తీవ్ర విషాదం ఉన్నట్లు తెలుస్తోంది. సదరు యువతి తల్లి ఈ మధ్యే చనిపోయింది. ఆ మరణాన్ని తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిందామె. ఆపై ఆమె ఇంట్లో నుంచి కనిపించకుండా పోయింది. ఆమె గురించి వెతికిన కుటుంబ సభ్యులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తల్లి సమాధిని ఆనుకుని పడుకుని పోయిందామె. అలా.. పగలూ రాత్రి తేడా లేకుండా కదలకుండా మూడు రోజులుగా ఆమె స్మశానంలోనే ఉండిపోయింది.
కదిలించే ప్రయత్నం చేస్తే.. గుర్రుగా చూస్తుండడంతో స్థానికులే కాదు కుటుంబ సభ్యులూ భయపడుతున్నారు. డిప్రెషన్‌లో ఉందా? మతి భ్రమించిందా? అనేది ఆమెను అక్కడి నుంచి తరలిస్తేనే స్పష్టత వచ్చేసింది. సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆమెను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.


