పురుగే.. వణికిస్తోంది | - | Sakshi
Sakshi News home page

పురుగే.. వణికిస్తోంది

Dec 3 2025 7:19 AM | Updated on Dec 3 2025 7:19 AM

పురుగ

పురుగే.. వణికిస్తోంది

ఆలస్యంగా బయటపడుతున్న లక్షణాలు

మహారాణిపేట: కంటికి కనిపించని చిన్న పురుగు నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పచ్చని పొదల్లో దాగి ఉన్న కీటకం కాటు వేసి మంచాన్ని పట్టిస్తోంది. సాధారణ జ్వరం వస్తే చాలు నగరవాసులు హడలిపోతున్నారు. ఓ వైపు మారుతున్న వాతావరణం, మరోవైపు నగరంలో విజృంభిస్తున్న స్క్రబ్‌ టైఫస్‌ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు పొరుగు జిల్లాల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

అసలేంటీ వ్యాధి?

నల్లి జాతికి చెందిన ‘ట్రాంబికులిడ్‌ మైట్స్‌’ అనే కంటికి కనిపించని చిన్న కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇవి పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. ఈ కీటకం కుట్టినప్పుడు ‘ఓరియాంటియా సుత్సుగముషి’అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పొలాల్లో లేదా చెట్ల పొదల్లో పనిచేసే వారు కాళ్లకు, చేతులకు పూర్తిగా దుస్తులు ధరించాలి. ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ లేదా యాంటీ–ఇన్సెక్టిసైడ్స్‌ స్ప్రే చేయాలి. పిల్లలు పార్కులు లేదా మైదానాల్లో ఆడుకునేటప్పుడు కీటకాలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ జ్వరం.. మందులకు తగ్గకుండా 3 రోజులకు మించి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

మరణాలు లేవు

జిల్లాలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఈ వ్యాధి వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదు. 2023లో 12, 2024లో 11, 2025లో ఇప్పటి వరకు 11 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. డాక్సిసైక్లిన్‌, అజిత్రోమైసిన్‌ వంటి మందులతో దీనిని సులభంగా నయం చేయవచ్చు. అయితే డాక్టర్‌ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. ఇంటి పరిసరాల్లో పొదలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. జ్వరం వస్తే సమీపంలోని పీహెచ్‌సీ లేదా యూపీహెచ్‌సీలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు.

– డాక్టర్‌ పి.జగదీశ్వరరావు, డీఎంహెచ్‌వో

ఈ కీటకం కుట్టిన వెంటనే ఎలాంటి నొప్పి ఉండకపోవచ్చు. కానీ కుట్టిన 6 నుంచి 21 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కీటకం కుట్టిన చోట శరీరంపై మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. ఇది ఈ వ్యాధిని గుర్తించడానికి ప్రధాన సూచిక. తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడి దగ్గు, జీర్ణ సమస్యలు ఉంటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు వాపు, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర పరిణామాలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చి, జ్వరం తగ్గకపోతే తప్పనిసరిగా ఎలిసా పరీక్ష ద్వారా స్క్రబ్‌ టైఫస్‌ను నిర్ధారించుకోవాలి. ప్రస్తుతం కేజీహెచ్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదవుతున్నాయి. అన్ని ఆసుపత్రుల గణాంకాల ప్రకారం దాదాపు 200 మందికి పైగా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు సమాచారం. అయితే, బాధితులకు సకాలంలో వైద్యం అందించి డిశ్చార్జ్‌ చేస్తుండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేజీహెచ్‌లో నవంబర్‌లో 196 మందికి పరీక్షలు నిర్వహించగా.. 19 మందికి పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌, భావనగర్‌ వార్డుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు.

జ్వరం వస్తే భయం భయం జిల్లాలో నమోదవుతున్న స్క్రబ్‌ టైఫస్‌ కేసులు అప్రమత్తం అంటున్న డాక్టర్లు

ఆందోళన వద్దు

స్క్రబ్‌ టైఫస్‌ అనుమానిత కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఆందోళన చెందాల్సిన పనిలేదు. నవంబర్‌లో మా ఆసుపత్రిలో 19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రోగులకు మెరుగైన చికిత్స అందించి ఇంటికి పంపాం. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా కేజీహెచ్‌కు రావాలి. ఓపీకి వచ్చే జ్వరపీడితులకు అవసరమైన పరీక్షలు చేసి..స్క్రబ్‌ టైఫస్‌ ఉంటే తక్షణమే చికిత్స అందిస్తున్నాం.

– డాక్టర్‌ ఐ.వాణి, సూపరింటెండెంట్‌, కేజీహెచ్‌

పురుగే.. వణికిస్తోంది1
1/2

పురుగే.. వణికిస్తోంది

పురుగే.. వణికిస్తోంది2
2/2

పురుగే.. వణికిస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement