అన్నదాతకు మళ్లీ వెన్నుపోటు
మహారాణిపేట : చంద్రబాబు పాలనలో రైతులకు కష్టకాలం దాపురించింది. రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం సహాయం విషయంలో వంచనకు పాల్పడుతోంది. అధికారం చేపట్టిన తొలి ఏడాది అన్నదాత సుఖీభవ ఊసేలేదు. రెండో సంవత్సరం ఆగస్టు నెలలో అయిదు వేలు రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇటీవల రెండో విడత సాయం అందించినా కౌలు, ఇనాం రైతులకు ఎగనామం పెట్టింది.
మాట మార్చిన చంద్రబాబు
అన్నదాత సుఖీభవ విషయంలో చంద్రబాబు మాట మార్చారు. రైతులందరికి ఏడాది రూ.20 వేలు పెట్టుబడి సహాయం కింద ఇస్తామని ఎన్నికల ముందు హమీ ఇచ్చి ఇప్పుడు కొందరికే అంటూ నాలుక మడతవేశారు. కౌలు, ఇనాం రైతులు అన్నదాత సుఖీభవ అర్హులు కాదంటూ తేల్చేశారు.
6,499 మంది రైతులకు మొండి చెయ్యి
ఈ పథకానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరంలో 18,573 మంది రైతులను అర్హులుగా ఎంపిక చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద 18,100 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 25,072 మంది రైతులకు భరోసా కింద నిధులను నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది. ఇందులో 6,499 మంది లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవ పధకానికి దూరం చేశారు.
నిబంధనల పేరిట తగ్గింపు
గతంలో ఎప్పుడూ లేని నిబంధనలను చందబాబు సర్కార్ అమలు చేస్తోంది. కౌలు రైతు, కుటుంబంలో ఒక్కరే లబ్ధిదారుడు
ఎంపిక, పది సెంట్లలోపు భూమి ఉన్నవారు తొలగింపు, ఆధార్, ఈకేవైసీ, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాలేదని వంటి కారణాలతో జిల్లాలో 6,499 మంది రైతులను జాబితా నుంచి తొలగించారు. గతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 25,072 మంది రైతులకు రైతు భరోసా ఇవ్వగా చంద్రబాబు సర్కార్ 18,573 మంది రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించింది.
అర్హులందరికి ఇవ్వాలి
చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో అర్హుల సంఖ్య తగ్గించడం దారుణం. కావాలనే కొంతమంది రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించింది. వ్యవసాయం చేస్తున్న రైతులందరికి అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వాలి. వ్యవసాయానికి చేయూతనిచ్చి ఆదుకోవాలి.
– తమ్మిన సీతారామ్, టి.నగరపాలెం
రైతులకు అన్యాయం
రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. గత ఏడాది రైతులకు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇచ్చినా జాబితాలో అనేక మంది రైతుల పేర్లు తొలగించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన రైతులకు సాయం అందేది.
– రవ్వ ఈశ్వరరావు,
తాటితూరు, భీమిలి మండలం
అన్నదాతకు మళ్లీ వెన్నుపోటు
అన్నదాతకు మళ్లీ వెన్నుపోటు


