ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ప్రభుత్వమిది
18న వైద్య కళాశాలల
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన
జనవరి 18న ఖమ్మంలో
సీపీఐ శతజయంతి ఉత్సవాలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
గుజ్జల ఈశ్వరయ్య
అల్లిపురం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. అల్లిపురం, సీపీఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ జిల్లా సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 నగదు తదితర హామీలను విస్మరించిందన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 47 శాతం సీట్లు అమ్మేందుకు వీలుగా జారీ చేసిన 107, 108 జీవోల రద్దు హామీతో ఎన్నికల్లో గెలిచి, ఆ జీవోలను రద్దు చేయకుండా వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసి వంద శాతం సీట్లను విక్రయించే అవకాశం కల్పించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంతో పాటు 35 సంవత్సరాలు లీజుకు ఇస్తూ వైద్య విద్యను వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జనవరి 18న సీపీఐ శత జయంతి ఉత్సవాలు, బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ నెల 10న మోంఽథా తుఫాన్ వలన నష్టపోయన రైతుల సమస్యలపై, 18న వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శులు కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.


