డేటింగ్ యాప్‌లను పూర్తిగా నిషేధించాలి
మద్దిలపాలెం : ఆడవాళ్లను అంగట్లో సరుకులాగా అమ్మేసే డేటింగ్ యాప్‌లను పూర్తిగా నిషేధించాలని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఎస్ ఎల్.ఎన్.వాసు డిమాండ్ చేశారు. మంగళవారం జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటింగ్ యాప్ నిర్వాహకులు ఫ్రెండ్ షిప్ పేరుతో మహిళల మానాలను ఎరగా వేసి కోట్లాది రూపాయలు దండుకోవడాన్ని జన జాగరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పైగా ఇటువంటి ఆన్‌లైన్ వ్యభిచారం భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేస్తుందన్నారు. లవర్స్ డేను తీవ్రంగా వ్యతిరేకించే హిందూ సంఘాలు డేటింగ్ యాప్‌లను ఎందుకు వ్యతిరేకించడంలేదో అర్థం కావడం లేదన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే డేటింగ్ యాప్‌ల నిషేధ చట్టం తీసుకురావాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో జన జాగరణ సమితి ఉత్తరాంధ్ర జోనల్ కన్వీనర్ తాళ్లవలస దుర్గాప్రసాద్, విశాఖ జిల్లా కన్వీనర్ దేవర శంకర్, నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, సభ్యులు శివ, విక్రమ్ కృష్ణ, ప్రెసిడెన్సి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
నోటికి నల్ల రిబ్బన్‌లతో
జన జాగరణ సమితి మౌన ప్రదర్శన


