లోకో రన్నింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారానికి నిరాహార దీక
తాటిచెట్లపాలెం: ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ కేంద్ర కార్యవర్గ సమితి నిర్ణయం మేరకు లోకో రన్నింగ్ సిబ్బంది(అసిస్టెంట్ లోకో పైలట్లు, లోకో పైలట్లు) తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 48 గంటల నిరాహారదీక్షలు చేపట్టారు. దీనిలో భాగంగా వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ దీక్షలను సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌సీ పాణిగ్రాహి, ఎ.భోలేనాథ్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. గురువారం ఉదయం 10 వరకు ఈ దీక్ష కొనసాగుతుందన్నారు. నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, కిలోమీటర్ అలవెన్స్ 25 శాతం పెంపు, కి.మీ.అలవెన్స్‌లో 70 శాతం పన్ను నుంచి మినహాయింపు, ఏఎల్‌పీ నియామక ప్రక్రియ వేగవంతం, రన్నింగ్ సిబ్బందికి 10 గంటలకు మించని డ్యూటీలు తదితర డిమాండ్లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సిటు జనరల్ సెక్రటరీ సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ గత నెల 21 నుంచి అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని, ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనివేళలను ఖచ్చితంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం పనివేళల్ని 13 గంటలకు పెంచాలని ప్రయత్నాలు ప్రారంభించిందని, దీన్ని వెంటనే విరమించాలని, రైల్వేలో అత్యంత సున్నితమైన రన్నింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. లోకో రన్నింగ్ సిబ్బంది దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ జోనల్ ప్రెసిడెంట్ ఎస్‌కే చౌబ్లే, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బీవీఎస్‌వీ రాజు, జాయింట్ డివిజనల్ సెక్రటరీ టీహెచ్ హరికృష్ణ, బ్రాంచ్ సెక్రటరీ ఎం.చిన్నోడు, ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ ఆర్‌వీఎస్‌ఎస్ రావు తదితరులు పాల్గొని మాట్లాడారు.


