ఇండియన్ సినిమా అంటే చాలామంది బాలీవుడ్ అని మాత్రమే అనుకునేవారు. కానీ, పరిస్థితులు మారాయి. దక్షిణాది ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి. తెలుగు సినిమా ప్రపంచవేదికలపై జెండా ఎగరేసింది. కన్నడ, తమిళ, మలయాళ సినిమాలు కూడా దేశవ్యాప్తంగా గట్టి సౌండ్ చేస్తున్నాయి. ఎన్నో సినిమాలు వంద కోట్ల రికార్డును అవలీలగా దాటేశాయి.
176 రెట్ల లాభాలు
అయితే ఈ ఏడాది ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకోలేకపోయింది. కాంతార 2, ఛావా చిత్రాలు సైతం ఈ రికార్డుకు రెండు అడుగుల దూరంలోనే ఆగిపోయాయి. భారీ అంచనాలతో బరిలో దిగిన పెద్ద సినిమాలు వార్ 2, కూలీ అయితే జనాలను నిరాశపర్చాయి. పెద్ద సినిమాల సంగతిలా ఉంటే ఈ ఏడాది రిలీజైన ఓ చిన్న సినిమా ఏకంగా 176 రెట్ల లాభాలను గడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా బాలీవుడ్ నుంచో సౌత్ నుంచి వచ్చింది కాదు.
మొదటి వారం అంతంత మాత్రమే
గుజరాతీ మూవీ.. అదే లాలో- కృష్ణ సదా సహాయతే (Laalo – Krishna Sada Sahayate). కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 10న విడుదలైంది. మొదట్లో దీన్నెవరూ పట్టించుకోలేదు. ఈ కారణంగా తొలి రోజు ఇండియాలో కేవలం రూ.4 లక్షల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కానీ, మౌత్ టాక్‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. అయినప్పటికీ మొదటి వారం అంతా కలిపితే రూ.33 లక్షలే వచ్చాయి.
రికార్డుకెక్కిన మూవీ
సినిమా రిలీజైన 24వ రోజు అసలైన మ్యాజిక్ జరిగింది. ఆ రోజు రూ.1 కోటి వసూళ్లు వచ్చాయి. ఇదే పెద్ద అమౌంట్ అని అందరూ ఫీలవుతున్న సందర్భంలో 31వ రోజు ఏకంగా రూ.7.1 కోట్లు వచ్చాయి. అలా ఇప్పటివరకు (నవంబర్ 26నాటికి) ప్రపంచవ్యాప్తంగా రూ. 88.04 కోట్లు రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక లాభం తెచ్చిపెట్టిన సినిమాగా లాలో- కృష్ణ సదా సహాయతే రికార్డుకెక్కింది. అంతేకాదు, గుజరాతీ చలనచిత్ర పరిశ్రమలో ఇంత భారీ వసూళ్లు సాధించిన తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం
సినిమా
ఈ మూవీలో రీవ రచ్, శ్రుహాద్ గోస్వామి, కరణ్ జోషి కీలక పాత్రలు పోషించారు. అంకిత్ సఖియ దర్శకత్వం వహించాడు. కథేంటంటే.. లాలూ అనే రిక్షా డ్రైవర్ గతం గురించి తల్చుకుని బాధపడుతూ ఉంటాడు. అతడికి తరచూ కలలో కృష్ణుడు కనిపిస్తాడు. దేవుడు రిక్షా డ్రైవర్‌ను మళ్లీ మామూలు మనిషిగా ఎలా మార్చాడన్నదే కథ!


