సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ చెలరేగిపోయాడు. తమిళనాడుతో ఇవాళ (డిసెంబర్ 2) జరుగుతున్న మ్యాచ్లో కేవలం 46 బంతుల్లోనే అజేయమైన శతకం (102) బాదాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
పడిక్కల్తో పాటు శరత్ (23 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మరణ్ రవిచంద్రన్ (29 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 3 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మిగతా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ 24, కరుణ్ నాయర్ 4 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్ 2, టి నటరాజన్ ఓ వికెట్ తీశారు.
కాగా, ప్రస్తుత SMAT సీజన్లో ఇప్పటికే ఏడు సెంచరీలు (పడిక్కల్ది కాకుండా) నమోదయ్యాయి. ముంబై ఆటగాడు ఆయుశ్ మాత్రే 2, అభిమన్యు ఈశ్వరన్, రోహన్ కున్నుమ్మల్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ఉర్విల్ పటేల్ తలో సెంచరీ చేశారు.


