దొడ్డబళ్లాపురం (కర్ణాటక): సమాజంలో కట్టుబాట్లకు ఏమాత్రమూ విలువ లేకుండా పోతోంది. అనైతిక మార్గాలలో ప్రయాణిస్తూ కాపురాలను నాశనం చేసుకోవడం అధికమైంది. ఈ తరహాలో దావణగెరె జిల్లా గుమ్మనూరులో వివాహం జరిగిన రెండు నెలలకే నవ వధువు ప్రియునితో వెళ్లిపోవడంతో అవమానం భరించలేని భర్త సూసైడ్ నోట్ రాసి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు నిందితురాలు సరస్వతిని తాజాగా అరెస్టు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు నెలల క్రితమే హరీష్‌కు సరస్వతిని ఇచ్చి కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. యువతి మేనమామ రుద్రేశ్ (36) ఈ సంబంధాన్ని ఖాయం చేసి దగ్గరుండి వివాహం చేయించారు. అయితే, ఇటీవల ఆమె గుడికి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి ప్రియుడు శివకుమార్‌తో పారిపోయింది. అంతకుముందే ఆమె భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.
వరుసగా మరొకరు..
ఇది తట్టుకోలేని హరీష్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని తనువు చాలించారు. భార్య, ఆమె ప్రియుడు, ఆమె బంధువులు గణేశ్, అంజినమ్మ తనను బెదిరించి వేధించారని, తన ఆత్మహత్యకు వారే కారణమని హరీష్ సూసైడ్ నోట్‌లో రాశాడు. ఈ ఘోరాలను చూసిన రుద్రేశ్ ఆవేదన చెంది పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
ఇద్దరి ఆత్మహత్యలకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సరస్వతిని దావణగెరెలోని ఎలెబేతూరులో బంధువుల ఇంట్లో ఉండగా అరెస్టు చేశారు. ప్రియుడు పరారీలో ఉన్నాడు. సరస్వతి చేసిన చిన్న తప్పిదం కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం మిగిలింది.


