టీమిండియా మోస్ట్ ప్రామిసింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దేశవాలీ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. జాతీయ విధులకు దూరంగా ఉండటంతో రంజీ బాట బట్టిన ఈ కర్ణాటక వికెట్‌కీపర్ బ్యాటర్.. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87 బంతుల్లో 59; 9 ఫోర్లు) మెరిశాడు. క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే కర్ణాటక ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.
Highlights of KL Rahul’s 59 (87) in the Ranji Trophy. pic.twitter.com/AeV5DXI2aQ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2026
కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్, మయాంక్ రాణించినా, ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఎదురీదుతోంది.
రెండో రోజు టీ విరామం సమయానికి సగం వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు చేరుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది.
శ్రేయస్ గోపాల్ (17), కృతిక్ కృష్ణ (20) కర్ణాటకను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఔటయ్యాక కర్ణాటక స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్, స్మరణ్ రవిచంద్రన్ తలో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు.
వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్ (32) క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీసి కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. ఎమన్‌జోత్ సింగ్ చహల్ కీలకమైన మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు.
అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిజీత్ గార్గ్ (81), ఎమన్‌జోత్ సింగ్ చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (44) ఓ మోస్తరుగా రాణించగా.. అన్మోల్ మల్హోత్రా (25), ఆయుశ్ గోయల్ (23), సుఖ్‌దీప్ బజ్వా (20) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు.


